కష్టకాలంలోనూ వ్యాక్సిన్ వ్యాపారమా..? బాధ్యత ఉండక్కర్లేదా..?

కరోనా కష్టకాలం ఇది. కనీవినీ ఎరుగని మహోత్పాతం. కలలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎవరూ ఊహించలేదు. కానీ విపత్తు వచ్చింది. విపత్తును అందరూ కలసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. కానీ కష్టకాలంలోనూ కొంతమంది కాసులకోసం కక్కుర్తి పడుతున్నారు. అయినకాడికి దండుకునేందుకు ఎగబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కొనేందుకు చికిత్స లేదు కాబట్టి వ్యాక్సిన్ మాత్రమే తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఆపదవేళ టీకాను కూడా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు.
ఇవాల్టి వరకూ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే సాగింది. 45 ఏళ్లు పైబడినవాళ్లకు ఉచితంగా అందిస్తోంది. అయితే రేపటి నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికీ టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లలో 50శాతం కేంద్ర ప్రభుత్వానికి అమ్మాలని.. మిగిలన వాటిని కంపెనీలు వాటికి ఇష్టం వచ్చిన వాళ్లకు అమ్ముకోవచ్చని ప్రభుత్వం అనుమతించింది. దీంతో వ్యాక్సిన్ వ్యాపారానికి తెరలేచింది. కంపెనీలు వ్యాక్సిన్లను బేరానికి పెట్టాయి. కేంద్ర ప్రభుత్వానికి ఒక రేటు, రాష్ట్ర ప్రభుత్వాలకు మరో రేటు, ప్రైవేటు ఆసుపత్రులకు ఇంకో రేటు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రేటు పెట్టి అమ్మకాలు మొదలు పెట్టాయి.
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్ట్ ను మొదట 150 రూపాయలకే ఒక డోసు ఇస్తామని ఆ సంస్థ సీఈవో అదార్ పూనావాలా ప్రకటించారు. అయితే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మొదటి ఆర్డర్ కు మాత్రమేనని.. ఆ తర్వాత కొత్త ఆర్డర్లను 400 రూపాయలకు తీసుకుంటామని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక్కో డోసు 400 చొప్పున ఇస్తామని ప్రకటించింది. అయితే విమర్శలు పెద్దఎత్తున రావడంతో వంద రూపాయలు తగ్గిస్తున్నట్టు చెప్పింది. ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రం ఒక్కో డోసును 600లుగా ధర నిర్ణయించింది.
ఆ తర్వాత రెండ్రోజులకు భారత్ బయోటెక్ కూడా తమ ధరలను ప్రకటించింది. భారత్ బయోటెక్ దేశీయంగా కొవాగ్జిన్ ను ఉత్పత్తి చేసింది. సీరం ఇనిస్టిట్యూట్ కు మించిన ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఏకంగా 600 రూపాయలు, ప్రైవేటు ఆసుపత్రులకు 1200లకు విక్రయిస్తామని తెలిపింది. అయితే భారత్ బయోటెక్ పైన కూడా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కాస్త దిగొచ్చిన ఆ సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసును 400 రూపాయలకు ఇస్తామని తెలిపింది. వాస్తవానికి మంచి నీళ్ల బాటిల్ ధర కంటే తక్కువ ధరకే వ్యాక్సిన్ అందిస్తామని ఆరంభంలో ప్రకటించారు భారత్ బయోటెక్ ఎంటీ కృష్ణ ఎల్లా. ఇప్పుడేమో అందరి కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.
సీరం ఇనిస్టిట్యూట్ బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి కోవిషీల్డ్ ను అభివృద్ధి చేసింది. కానీ భారత్ బయోటెక్ మాత్రం పూర్తి స్వదేశీ వ్యాక్సిన్ కొవాగ్జిన్ ను డెవలప్ చేసింది. అది కూడా ప్రభుత్వ సంస్థలైన ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థలతో కలిసి వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసింది. అంటే ఇందులో ప్రభుత్వానికి కూడా వాటా ఉంది. మరి అంత ధరలు పెట్టి ప్రభుత్వమే కొనుక్కోవడమేంటో ఎవరికీ అర్థం కావట్లేదు. పైగా కేంద్ర ప్రభుత్వానికి ఓరేటు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ రేటును నిర్ణయించడమేంటో తెలియట్లేదు. కష్టకాలంలో ఇలా వ్యాక్సిన్ తో వ్యాపారం చేయడమేంటని జనం మండిపడుతున్నారు.