కరోనా వేళలో… ఆదుకుంటున్న ఆపన్న హస్తం

కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఊహకు కూడా అందట్లేదు. రోజురోజుకూ గరిష్టస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ నెంబర్లను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. బాధితులు పెరుగుతుంటే మరోవైపు రికవరీ రేటు కూడా గణనీయంగా ఉంది. బాధితులకు అవసరమైన చికిత్స అందించడంలో పరిస్థితులు ఎంతో మెరుగుపడ్డాయి. భారత్ దయనీయ పరిస్థితి చూసి చలించిన ఎంతోమంది వ్యక్తులు, సంస్థలు, విదేశాలు.. భూరి విరాళాలిస్తున్నాయి. తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఆక్సిజన్, రెమిడెసివిర్ లాంటి మందులకు తీవ్ర కొరత ఏర్పడింది. అందుకే పలు దేశాలు ఆక్సిజన్ సరఫరాకు ముందుకొస్తున్నాయి. ఫ్రాన్స్ 8 ఆక్సిజన్ ప్లాంట్లు, జర్మనీ 23, ఐక్యరాజ్యసమితి 11 ఆక్సిజన్ ప్లాంట్లు పంపించేందుకు ముందుకొచ్చాయి. బ్రిటన్ నుంచి 9 కార్గో విమానాల ద్వారా అవసరమైన వస్తువులు అందుతున్నాయి. ఇవాళ అవి భారత్ చేరుకోనున్నాయి. రష్యా కూడా వైద్యసంబంధ పరికరాలను పంపిస్తోంది. సౌదీ అరేబియా 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, 5వేల ఆక్సిజన్ సిలిండర్లను పంపిస్తోంది. వీటిని అదాని గ్రూప్ సౌదీ నుంచి భారత్ తీసుకొస్తోంది. సింగపూర్ 8వందల ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను హాంకాంగ్ నుంచి ఎగుమతి చేస్తోంది. ఈ వారంలో మరో 10వేలు పంపించేందుకు సిద్ధమవుతోంది. దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కూడా హాంకాంగ్ నుంచి ఆక్సిజన్ ను తరలిస్తోంది.
దేశీయంగా కరోనా కేసులు పెరుగుతుండడం.. ఆక్సిజన్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడడంతో అటు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ సరఫరాను నిలిపేస్తూ ఆదేశాలిచ్చింది. అంతేకాక.. ఆక్సిజన్ ఉత్పత్తిని గరిష్టస్థాయిలకు తీసుకెళ్లాలని ఆదేశించింది. ఇప్పుడున్న ఆక్సిజన్ ను మెడికల్ ఆక్సిజన్ గా మార్చేందుకు ప్రయత్నించాలని అన్ని ఉత్పత్తి సంస్థలను కోరింది. పరిశ్రమలన్నీ ఆక్సిజన్ ను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని స్పష్టం చేసింది.
కరోనా విజృంభణ ఇప్పుట్లో ఆగే సూచనలు కనిపించట్లేదు. భవిష్యత్తులోనూ ఆక్సిజన్ కు తీవ్ర డిమాండ్ ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే ప్రధాని మోదీ కొత్తగా 551 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పీఎం కేర్స్ ఫండ్ నిధులతో వీటిని ఏర్పాటు చేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. అంతేకాదు.. యాంటివైరల్ డ్రగ్ రెమిడెసివిర్ కు కూడా తీవ్ర కొరత ఏర్పడింది. ఈ మందు బ్లాక్ మార్కెట్ కు తరలిపోయింది. ఇది దొరికితే చాలనుకుంటున్నారు కొంతమంది కరోనా బాధితులు. ఈ నేపథ్యంలో రెమిడెసివర్ ఉత్పత్తిని కూడా పెంచాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. రెమిడెసివిర్ మందును తయారు చేయాలంటూ కొత్తగా 25 కంపెనీలను కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్ సుఖ్ మండవీయ ఆదేశించారు. ఇప్పుడు 40లక్షల వయల్స్ మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అవుతుండగా.. కొత్త కంపెనీలు పని ప్రారంభిస్తే నెలకు 90 లక్షల వయల్స్ అందుబాటులోకి వస్తాయి.
ఇక రైల్వే రంగం పోషిస్తున్న పాత్ర గణనీయమైనది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాలో రైల్వేలదే కీలక పాత్ర. 140 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ ను దేశంలోని వివిధ ప్రాంతాలకు డెలివరీ చేసేందుకు రైల్వే శాఖ రేయింబవళ్లు పనిచేస్తోంది. అంతేకాక.. ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడడం, ఐసోలేషన్ కేంద్రాలన్నీ నిండిపోవడంతో.. రైల్వే కోచ్ లను ఐసోలేషన్ కేంద్రాలుగా మారుస్తోంది రైల్వే శాఖ. పలు రాష్ట్రాలకు వీటిని అప్పగిస్తోంది. ప్రస్తుతం 3వేల 816 రైల్వే కోచ్ లు అందుబాటులో ఉండగా.. రాష్ట్రాలు కోరితే మరిన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది.
విదేశీ దిగుమతులపై కూడా కేంద్రం పలు ఆంక్షలు తొలగించింది. కరోనా సంబంధిత పరికరాలు, మందుల రవాణా ఛార్జీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని పోర్టులకు ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాక.. ఆక్సిజన్, ఇతర కరోనా సంబంధిత పరికరాలు తీసుకొచ్చే ఓడలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. మరోవైపు మరో రెండు నెలల్లో 80 కోట్ల మంది పేదలకు నెలకు 5కిలోల చొప్పున బియ్యం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
రిలయెన్స్, అదానీ, సీరమ్, టాటా, జైడస్ కాడిలా లాంటి అనేక సంస్థలు కూడా కరోనాపై పోరులో తమవంతు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. దేశవ్యాప్తంగా ఆర్మీ, నేవీ కూడా రంగంలోకి దిగాయి. ఎక్కడికక్కడ తమ వంతు సాయం చేస్తున్నాయి. తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణానికి డీఆర్డీఓ కృషి చేస్తోంది. కరోనా బాధితులకు ఆహారాన్ని అందించేందుకు దేశవ్యాప్తంగా పలు ఆలయాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. అన్నిటికీ మించి భారత్ కు సాయం చేయాలన్న అంతర్జాతీయ ఒత్తిడికి అమెరికా తలొగ్గింది. అమెరికా ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తల వంచిన బైడెన్ భారత్ కు వ్యాక్సిన్ ముడిసరుకును పంపించేందుకు అంగీకరించారు.
కష్టం వచ్చిన మాట నిజం. కష్టాలొచ్చినప్పుడే మానవత్వం విలువ తెలిసేది. ఇప్పుడు అలాంటి మానవత్వం భారత్ లో వెల్లివిరుస్తోంది. కరోనాపై పోరులో విజయం సాధించేందుకు ప్రతిఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇదే ఉత్సాహం, ఐకమత్యంతో పనిచేస్తే త్వరలోనే ఈ మహమ్మారిని తరిమికొట్టొచ్చనే నమ్మకం కనిపిస్తోంది.