అమెరికా మరో కొత్త రికార్డు
కరోనా వైరస్ విజృంభణలో కూడా అమెరికా ప్రపంచ దృష్టిని తనవైపునకు తిప్పుకుంటోంది. అగ్రదేశంలో రికార్డు స్థాయిలో వైరస్ కేసులు నమోదు కావడమే అందుకు కారణం. గడిచిన 24 గంటల్లో 1,27,000 పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. మరణాల సంఖ్య 1,149గా ఉందని తెలిపింది. అలాగే కరోనా వైరస్ ప్రారంభ దశతో పోల్చుకుంటే మరణాల సంఖ్య ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నప్పటికీ, గత నాలుగు రోజులుగా ఆ సంఖ్య వెయ్యికి పైనే ఉంటోంది. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు సంభవించిన దేశంగా అమెరికా నిలిచింది. మొత్తంగా ఇప్పటివరకు 97 లక్షల పైచిలుకు కరోనా కేసులు నమోదు కాగా, 2,36,000 పైగా మరణాలు సంభవించాయి. శీతకాలం ప్రభావం ఎక్కువవుతుండటంతో కేసుల సంఖ్యలో మరింత పెరుగుదల ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.






