రెండవ ప్రపంచ యుద్ధ మృతుల కంటే ఎక్కువే! మహమ్మారి సమస్య తీవ్రం కాబోతోందని బైడెన్ హెచ్చరిక

ప్రాణాంతక కరోనా వైరస్ సమస్య మున్ముందు మరింత తీవ్రతరం కాబోతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. అమెరికాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య రెండవ ప్రపంచ యుద్ధ మృతుల సంఖ్య కంటే చాలా ఎక్కువని గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 96 మిలియన్ల పైచిలుకే. ఈ మధ్య బ్రిటన్‍లో పుట్టుకొచ్చిన కొత్త కరోనా వైరస్‍తో సహా కొత్త వైరస్ రకాలు పుట్టుకు వస్తుండడంతో ఈ ప్రాణాంతక మహమ్మారి మున్ముందు మరీ భయంకరంగా మారబోతోందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. బ్రిటన్‍లో కనిపించిన కొత్త కరోనా వైరస్ ఇప్పటికే దాదాపు 60 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఓ) వెల్లడించింది.
సుమారు 20 లక్షల మంది ప్రపంచవ్యాప్త కరోనా మృతులలోఅయిదవ వంతు మృతులతో అమెరికా అతి దారుణంగా దెబ్బతిన్న దేశంగా అవతరించింది. ఫలితంగా బైడెన్ ఈ మహమ్మారిపై పోరాటానికి తన పదవీ కాలంలో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.
‘‘ఈ ప్రతికూల శీతాకాలంలో మనం సర్వశక్తులూ వినియోగించి ఈ వైరస్‍పై పోరాడాలి. వైరస్‍కు సంబంధించి మనం ఒక భయంకర, దారుణ దశలోకి అడుగుపెడుతున్నాం’’ అని బైడెన్ తన ప్రమాణ స్వీకారోత్సవం రోజున వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతివారూ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించడం విశేషం.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధంలో పాల్గొన్నవారు, పాల్గొననివారితో కలిపి మొత్తం 405,399 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోగా, వైరస్ బారిన పడి 405,400 మంది మరణించినట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన ఒక పరిశోధకుడు వెల్లడించారు.
తన మొదటి 100 రోజుల పదవీ కాలంలో 100 మిలియన్ల మంది అమెరికన్లకు వ్యాక్సిన్ వేయాలన్నది బైడెన్ ప్రభుత్వ లక్ష్యాలలో ఒకటి. ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు చివరి రోజుల్లో వ్యాక్సినేషన్‍కు సంబంధించి చేసిన పొరపాట్లను చక్కదిద్దాలని బైడెన్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది.
విస్తృత నెట్‍వర్క్ కలిగిన ఈకామర్స్ దిగ్గజం ఆమెజాన్ ఈ లక్ష్యసాధనలో సహాయ సహకారాలు అందిస్తామని ముందుకు వచ్చింది.
ఇది ఇలా ఉండగా, బైడెన్ కొలువులో మహమ్మారిపై పోరాటానికి ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న జెఫ్ జెయింట్స్ మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థలో అమెరికా మళ్లీ చేరనున్నట్టు ప్రకటించారు. ఈ సంస్థ నుంచి వైదొలగుతూ గతంలో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉన్నతస్థాయి అమెరికా నిపుణుడు ఆంథొనీ ఫాసీ నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశానికి హాజరవుతుందని ఆయన తెలిపారు. బ్రిటన్‍లో కొత్త రకం కరోనా పుట్టి 60 దేశాలకు వ్యాపించిందని ఆరోగ్య సంస్థ ప్రకటించిన కొద్ది సేపటికే జెయింట్స్ తమ ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో పుట్టిన మరో కరోనా రకం ఇప్పటికి 23 దేశాలకు వ్యాప్తి చెందిందని ఆరోగ్య సంస్థ తెలియజేసింది. దక్షిణాఫ్రికాలో పుట్టిన వైరస్ ఇతర వైరస్‍లన్నిటికంటే వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజాదరణ ఏమీ లేకపోగా, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన లాక్‍డౌన్ వంటి నిర్ణయాలను ఉపసంహరించుకునేందుకు విస్తృత వ్యాక్సినేషన్ ఎంతగానో ఉపకరిస్తుందని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది.
ఒక శుభ వార్త కూడా ఉంది. ఫైజర్ బయోన్‍టెక్ వ్యాక్సిన్‍పై నిర్వహించిన రెండు అధ్యయనాలు బ్రిటన్‍లోని కొత్త వైరస్‍పై ఈ వ్యాక్సిన్ సమర్థంగా పని చేస్తుందని తేల్చి చెప్పాయి. కొత్త వైరస్‍తో బ్రిటన్‍లో ఆస్పత్రులు నిండిపోతున్న విషయం తెలిసిందే. ‘‘బ్రిటన్‍లో ఆస్పత్రికి వెడితే ఒక్కోసారి యుద్ధ భూమిలా కనిపిస్తోంది’’ అని బ్రిటిష్ ప్రభుత్వ ప్రధాన శాస్త్రవేత్త ప్యాట్రిక్ వేలెన్స్ తెలిపారు. బ్రిటన్ పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలకు భారీ సంఖ్యలో వ్యాక్సిన్ వేసేందుకు అది శాలిస్‍బరీ కెథడ్రల్ వంటి భారీ భవనాలను ఉపయోగించుకుంటోంది. ఇక్కడ వేలాది మంది వృద్ధులు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.