కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ సలహాదారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు కరోనా బారిన పడ్డారు. దీంతో ట్రంప్ కూడా కోవిడ్ 19 పరీక్ష చేయించుకున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణం, మరోవైపు అమెరికాలో ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో ట్రంప్ ఉన్నత సలహాదారుగా పనిచేస్తున్న హోప్ హిక్స్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. చిన్నవిరామం కూడా తీసుకోకుండా కష్టపడుతున్న హోప్ హిక్స్ కరోనా బారిన పడ్డారు. ఈ వారంలో ఆమె ట్రంప్‌తో పలుసార్లు ప్రయాణించారు. అలాగే బుధవారం ఒక ర్యాలీలో పాల్గొన్న మరుసటి రోజు ఆమెకు కరోనా సోకడంతో పార్టీ వర్గాల్లో అలజడి మొదలైంది.
క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన సమావేశంతో సహా ఆమె ఇటీవల అధ్యక్షుడితో పలుసార్లు ప్రయాణించారు. మిన్నెసోటాలో ట్రంప్ ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. హిక్స్ గతంలో వైట్‌హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రతినిధిగా పనిచేశారు. రానున్న ఎన్నికల సందర్భంగా ఈ ఏడాది ప్రారంభంలో ఆమె తిరిగి వైట్ హౌస్‌కు వచ్చారు.






