గ్రేటర్ లో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఉంటుందా?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‍ఎంసీ) ఎన్నికల పర్వం ముగిసింది. ప్రచారంలో రోడ్‍షోలు, సభలు సమావేశాల్లో జనం ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా పాల్గొన్నారు. భారత్ బంద్ సందర్భంగా కూడా ధర్నాలతో పాటు ఇతర కార్యక్రమాల్లో జనం కరోనా కాలాన్ని మరిచిపోయారు. లింగోజిగూడ కార్పొరేటర్‍గా విజయం సాధించిన ఆకుల రమేష్ గౌడ్‍కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రజాప్రతినిధులు, ప్రచారంలో పాల్గొన్న జనానికి కొవిడ్ భయం పట్టుకుంది.
ఎన్నికల ముందు నవంబర్‍లో రోజుకు సుమారు 100కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారు క్వారంటైన్‍లోకి వెళ్లక పోవడం అందోళన కల్గిస్తున్న అంశం. దీంతో ఈ సంఖ్య రానున్న మూడు, నాలుగు రోజుల్లో పెరిగే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఆయా రాజకీయ నాయకులలో వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. మున్ముందు కేసుల సంఖ్యను నివారించాలంటే ప్రచారంలో పాల్గొన్న ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు క్వారంటైన్‍లోకి వెళ్తే మంచిదని సూచిస్తున్నారు. వీరంతా వారం రోజుల పాటు క్వారంటైన్‍లో ఉండాలి. కానీ అవేవీ పట్టనట్లుగా వీరు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా కచ్చితంగా క్వారంటైన్‍లో ఉండాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రానికి సెకండ్ వేవ్ కరోనా ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి కోవిడ్ వ్యాపించే ప్రమాదం ఉంది. ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తల ద్వారా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, నేతలు, అభిమానులతోపాటు ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్‍కు ప్రచారం నిమిత్తం వచ్చినవారు తిరిగి సొంత జిల్లాలు, గ్రామాలకు వెళ్లిపోయారు. ఈ ప్రభావం కూడా మరో వారం రోజుల్లో బయటకు వచ్చే ప్రమాదం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ కూమారుడు, నలుగురు కార్పొరేటర్లు, వారి కుటుంబికులు, ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‍లో పాల్గొన్న 18 మందికి అధికారులకు కరోనా వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఎన్నికల విధులు నిర్వర్తించిన ముగ్గురు పోలీస్ అదికారులకు, ఎస్‍ఆర్‍నగర్ పీఎస్ పరిధిలో ఆరుగురు సిబ్బందికి రెండోసారి కరోనా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పోలింగ్, కౌంటిగ్‍లో పాల్గొన్న మిగతా ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.