కోవిషీల్డ్ ధరలు ఖరారు! టీకా మీకెప్పుడు వస్తుంది?

కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకునేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మే 1నుంచి 18 ఏళ్ల పైబడినవారందికీ టీకా అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. అయితే అందరికీ టీకా అందించాలంటే భారీగా ఉత్పత్తి పెంచాల్సి ఉంటుంది. ఇది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. అయితే వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా టీకా ఉత్పత్తి గణనీయంగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలకు ఆర్థిక రుణం ప్రకటించింది.
మే 1 నుంచి టీకా అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే 45 ఏళ్లు పైబడినవారికి మాత్రమే టీకాను ఉచితంగా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా ప్రభుత్వ కేంద్రాల్లో టీకా తీసుకునేవాళ్లకు మాత్రమో ఉచితం. 45 ఏళ్లు పైబడినవాళ్లు ఎవరైనా ప్రైవేటు కేంద్రాల్లో టీకా వేయించుకోవాలనుకుంటే డబ్బు చెల్లించాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రైవేటు మార్కెట్లో టీకా ధరలను ప్రకటించింది సీరం ఇనిస్టిట్యూట్. ఇది కోవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వాలకు కోవిషీల్డ్ టీకాలను 400 రూపాయలకు ఒక డోసు చొప్పున ఇవ్వనున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. ప్రైవేటు హాస్పిటళ్లకు ఒక డోసు కోవిషీల్డ్ 600 రూపాయలకు అందిస్తామని ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా చెప్పారు. దీంతో ప్రభుత్వ కేంద్రాల్లో రెండు డోసుల టీకా 800 రూపాయలు ఖర్చవుతుంది. అయితే ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా టీకా లభిస్తుంది కాబట్టి వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ప్రైవేటు కేంద్రాల్లో ఒక్కో డోసు ధర 600 కావడంతో రెండు డోసులకు 1200 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి వినియోగదారుల ఛార్జీలు అదనంగా ఉంటాయి. ప్రపంచ వ్యాక్సిన్లతో పోల్చితే తమ కోవిషీల్డ్ టీకా ధర తక్కువకే లభిస్తుందని సీరం ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్‌లో అమెరికా టీకాల ధర 15 వందల రూపాయలుండగా.. రష్యా టీకా 750 రూపాయలు, చైనా టీకాలు 750 రూపాయలకు లభిస్తున్నాయి.
ప్రభుత్వం ఆర్థిక రుణం ప్రకటించడం, మే 1 నుంచి అందరికీ టీకా అందుబాటులోకి తెస్తుండడం మంచి పరిణామమని సీరం ఇనిస్టిట్యూట్ అభిప్రాయపడింది. వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేస్తామని ప్రకటించింది. అయితే ప్రైవేటు మార్కెట్లోకి టీకా రావడానికి 4,5 నెలల సమయం పట్టొచ్చని అంచనా వేస్తోంది. ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న టీకాలను ప్రభుత్వానికి సప్లై చేయాల్సి ఉండడం, కొన్నింటిని విదేశాలకు ఎగుమతి చేసేలా ఒప్పందాలు ఉండడం.. ఆలస్యానికి కారణం. అందుకే ఓపెన్ మార్కెట్లో కోవిషీల్డ్ టీకా వేయించుకోవాలనుకునేవాళ్లు నాలుగైదు నెలలు కనీసం వెయిట్ చేయాల్సి ఉంటుంది.