వచ్చే నెలలోనే రష్యా టీకా!
రష్యా తయారీ కోవిడ్ టీకా త్వరగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని, వచ్చే నెలలోనే మార్కెట్లోకి విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తాము విడుదల చేస్తున్న వ్యాక్సిన్ పూర్తి సురక్షితమైందని రష్యా రక్షణ శాఖకు చెందిన సెంట్రల్ సైంటిఫిక్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఈ టీకా ఒకసారి వేసుకుంటే రెండేళ్లపాటు కరోనా నుంచి రక్షణ ఇస్తుందని పేర్కొంది. ‘సెచెనెవ్ యూనివర్సిటీ తయారీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఈనెల 20వ తేదీన బుర్డెంకో ఆస్పత్రిలో పూర్తయ్యాయి. పరిశోధనలు ఇంకా ముగియనప్పటికీ ఫలితాలు సానుకూలంగా వచ్చాయి’ అని రష్యా రక్షణ శాఖకు చెందిన సెంట్రల్ సైంటిఫిక్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ అధిపతి సెర్గీ బోరిసేవిచ్ తెలిపారని అక్కడి మీడియా వెల్లడించింది. చివరి, మూడో క్లినికల్ ట్రయల్స్ పూర్తికాక మునుపే టీకా ను విడుదల చేయనున్నట్లు రష్యా ఆరోగ్య మంత్రి తెలిపారు. దేశీయంగా 3 కోట్ల డోసులు, విదేశాల్లో 17 కోట్ల డోసుల్ని తయారు చేస్తామని రష్యా ఇప్పటికే తెలిపింది. ఈ వ్యాక్సిన్ తయారీకి 5 దేశాలు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొంది. చివరి దశ క్లినికల్ ట్రయల్స్‌ను ఆగస్టు 3న రష్యాతోపాటు సౌదీ, యూఏఈల్లో చేపట్టనుంది.






