రెమిడెసివర్ కు అంత సీన్ లేదు..! తొందరపడొద్దు!!

కరోనా సెకండ్ వేవ్ అంచనాలకు అందకుండా వ్యాపిస్తోంది. మొదటి వేవ్ ను లాక్ డౌన్ తో సమర్థంగా కట్టడి చేశామని చెప్తున్న ప్రభుత్వానికి .. సెకండ్ వేవ్ ను ఎలా కంట్రోల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అంతిమ పరిష్కారంగా మాత్రమే లాక్ డౌన్ ను ప్రయోగించాలనుకుంటోంది. కేవలం ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడం ద్వారానే దీనికి అడ్డుకట్ట వేయొచ్చని సూచిస్తోంది. అయితే ఇప్పటికే లక్షలాది మంది కరోనా బారిన పడిపోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు నిండిపోతున్నాయి. మందులు కూడా దొరకని పరిస్థితి. రెమిడెసివర్, ఆక్సిజన్ కోసం పరుగులు పెడుతున్నారు. రెమిడెసివర్ ను కొంతమంది బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే రెమిడెసివర్ కు అంత సీన్ లేదంటున్నారు నిపుణులు.
కరోనాను కట్టడి చేసేందుకు రెమిడెసివర్ పనిచేస్తుందనే బాగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ మందుకోసం జనం విపరీతంగా ఎగబడుతున్నారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని హెటిరో ఆఫీస్ దగ్గర రెమిడెసివర్ కోసం నిత్యం తోపులాటలు జరుగుతున్నాయి. దీంతో చేతులెత్తేసిన హెటిరో యాజమాన్యం.. ఆన్ లైన్ ద్వారానే రెమిడెసివర్ ను అందిస్తామని ప్రకటించింది. అయితే రెమిడెసివర్ కరోనాకు మందు కాదంటున్నారు నిపుణులు. ఇది కరోనా కోసం తయారు చేసిన మందు కాదు. అందుకే రెమిడెసివర్ పై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు.
రెమిడెసివర్ వల్ల ప్రాణభయం తగ్గుతుందని చెప్పడానికి ఎలాంటి అధారాలూ లేవంటున్నారు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి. దీనివల్ల హాస్పిటలైజేషన్ సమయం తగ్గుతుంది కానీ ప్రాణాలను మాత్రం కాపాడే శక్తి దీనికి లేదంటున్నారు. అయితే రికవరీ సమయం తగ్గుతుందని చెప్పేందుకు కూడా సరైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. రెమిడెసివర్ పై ఇప్పటివరకూ ప్రామాణికమైన ట్రయల్స్ జరగలేదని.. చిన్నపాటి ట్రయల్స్ మాత్రమే జరిగాయని.. వాటినే ప్రామాణికంగా తీసుకోవడానికి వీల్లేదని శ్రీనాథ్ రెడ్డి తేల్చిచెప్పారు.
రెమిడెసివర్ అనేది ఒక యాంటీవైరల్ ఔషధం. అంతేకానీ కరోనా వైరస్ కు మాత్రమే నిర్దేశించిన మందు కాదు. కరోనా అనేది వైరస్ కాబట్టి.. వైరస్ ను తగ్గించేందుకు ఉపయోగిస్తున్న రెమిడెసివర్ ను కూడా వాడుతున్నారు. అంతేకానీ ఇది నిర్దిష్టంగా కరోనాకోసం తయారు చేసింది కాదు. కొంతమందిపై ఈ మందు పని చేస్తుండవచ్చు. కానీ ఇది మాత్రం కరోనాకు ఏకైక పరిష్కారం కాదు. కాబట్టి ఈ మందుకోసం ఆతృతపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అత్యవసరమైతేనే వైద్యులు దీన్ని సిఫారసు చేస్తారని.. లేకుంటే దీని జోలికి వెళ్లకపోవడమే మంచిదని స్పష్టం చేస్తున్నారు. డాక్టరు సూచించకుండా రెమిడెసివర్ ను అస్సలు తీసుకోవద్దని స్పష్టం చేస్తున్నారు. సో.. బీకేర్ ఫుల్.