ఆ వ్యాక్సిన్ తో కరోనా చస్తోంది…
కరోనా మహమ్మారిని చంపే వ్యాక్సిన్ తయారవుతోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తాము రూపొందిస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వస్తోందని తెలిపింది. వర్సిటీ అస్ట్రాజెనెకాతో కలిసి రూపొందించిన కరోనా టీకా ఒకటి, రెండో దశల క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. బ్రిటన్‌లోని ఐదు ఆస్పత్రుల్లో 18-55 ఏళ్ల మధ్యనున్న 1,107 మంది ఆరోగ్య వంతులపై చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌లో వైరస్‌ను నిరోధించేలా వ్యాధినిరోధకతను పెంచే యాంటీబాడీలు, టీ సెల్స్ పెరిగినట్లు గుర్తించినట్లు వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ ఫలితాలు సోమవారం లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్, మేలో చేపట్టిన సార్స్-కోవ్-2 వ్యాక్సిన్ ట్రయల్స్ సందర్భంగా తీవ్రమైన ఎలాంటి సైడ్ ఎఫెక్టస్ కనిపించలేదని వ్యాక్సిన్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆండ్రూ పొలార్డ్ తెలిపారు. రెండో బూస్టర్ డోస్ టీకా ఇచ్చిన పది మందిలోనూ వ్యాధి నిరోధకత స్థాయిలు మరింత పెరిగినట్లు గుర్తించామని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన జెన్నర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఆడ్రియన్ హిల్ చెప్పారు.






