మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్ కష్టమే..!

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దీంతో కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించింది. తొలిరోజే సుమారు 70 లక్షల మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీళ్లంతా 1 నుంచి వ్యాక్సిన్ వేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగనుంది.
అయితే రిజిస్ట్రేషన్లకు అనుగుణంగా వ్యాక్సిన్ అందరికీ అందించేందుకు సాధ్యమేనా.. అనే సందేహం ఇప్పుడు తలెత్తుతోంది. ఎందుకంటే ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికే వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట్రాలు ఆపసోపాలు పడుతున్నాయి. డిమాండ్ మేరకు వ్యాక్సిన్ సప్లైలు లేక చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికీ 45 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద క్యూలో నిల్చుంటున్నారు. వాళ్లలో చాలా మందికి టీకా దొరకట్లేదు. ఇప్పటికే మొదటి డోస్ తీసుకుని రెండో డోస్ కోసం వెయిట్ చేస్తున్నవాళ్లూ అధికంగా ఉన్నారు. ముఖ్యంగా కొవాగ్జిన్ టీకాకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కోవిషీల్డ్ పర్లేదనిపిస్తోంది.
తమ డిమాండ్ కు సరిపడా ఆక్సిజన్ సప్లై లేకపోవడంతో మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వాళ్లకు వ్యాక్సిన్ అందించలేమని చేతులెత్తేస్తున్నాయి పలు రాష్ట్రాలు. మే చివరి నుంచి మాత్రమే 18 ఏళ్లు పైబడినవాళ్లకు వ్యాక్సిన్ అందించగలుగుతామని మహారాష్ట్ర చెప్తోంది. ఉత్తర ప్రదేశ్ మాత్రం మే 1 రోజు కొంతమంది అర్హులకు టీకా వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం 45 ఏళ్లు పైబడిన వాళ్లకు వ్యాక్సిన్ ను రెండ్రోజులపాటు నిలిపేస్తోంది. వీళ్లకు నిలిపేస్తే కానీ 18 ఏళ్లు పైబడిన వాళ్లకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ సర్కార్ కొత్తగా 1.3 కోట్ల వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇచ్చింది. ఇవి వచ్చే సమయాన్ని బట్టి 18 ఏళ్లకు పైబడిన వాళ్లకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. తెలంగాణ కూడా ఇప్పటికిప్పుడే 18 ఏళ్లు పైబడిన వాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వలేమని తేల్చేసింది.
ఉత్పత్తి కంపెనీల నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అనుమతించింది. దీంతో పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు టీకాలకు ఆర్డర్ ఇచ్చాయి. అయితే ఆర్డర్లకు అనుగుణంగా వెంటనే వ్యాక్సిన్లను సప్లై చేసేందుకు కంపెనీల దగ్గర సత్తా లేదు. ఇప్పటికే వచ్చిన ఆర్డర్లను కంప్లీట్ చేస్తే కానీ కొత్త ఆర్డర్లను తీసుకునే పరిస్థితి లేదు. కొత్త ఆర్డర్లకు వ్యాక్సిన్ సప్లే చేయడానికి కనీసం 1-2 నెలలు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు తాము ఇప్పటికిప్పుడు 18 ఏళ్లు పైబడిన వాళ్లకు వ్యాక్సిన్ ఇచ్చే స్థితిలో లేమని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చెప్పేశాయి. దీన్నిబట్టి చూస్తే.. చాలా రాష్ట్రాల్లో 1వ తేదీ నుంచి పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యేలా లేదు.