కరోనా టీకా తీసుకుంటే.. వారు 48 గంటలు ఆగాల్సిందే

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పైలట్లు కనీసం 48 గంటల పాటు వేచి ఉండి, ఆ తర్వాతే విమానాలు నడపాల్సిందిగా విమానాయానాన్ని నియంత్రించే డీజీసీఏ స్పష్టం చేసింది. అప్పటి వరకూ వారంతా మెడికల్ అన్‍ఫిట్ అని తేల్చి చెప్పింది. అంతేగాక 48 గంటల తర్వాత కూడా ఏ ప్రతికూల లక్షణాలు లేకపోతేనే నడపాలని తెలిపింది. అన్‍ఫిట్ లక్షణాలు 14 రోజులకు మించి సాగితే వారికి ప్రత్యేక మెడికేషన్ పరీక్ష ఉంటుందని, అనంతరం వారికి ఫిట్‍నెస్ ఉందో లేదో చెబుతామంది. పైలట్లతో పాటు క్యాబిన్ సిబ్బందికి కూడా ఇదే నియమం వర్తిస్తుందని చెప్పింది. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత విమానాల్లో పని చేసే సిబ్బందిని అరగంట పాటు వైద్యులు పరిశీలిస్తారని చెప్పింది.
జనవరి 16న ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ పక్రియలో భాగంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా టీకాలు తీసుకున్నారు. తొలుత ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‍లైన్ వర్కర్లకు వ్యాక్సిన్లు ఇవ్వగా.. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45-59 ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు టీకాలు వేస్తున్నారు.