డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ సంచలనం.. 2DG డ్రగ్ రెడీ!

కోవిడ్ సెకండ్ వేవ్‌తో ఇండియా విలవిలాడుతోంది. ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఆక్సిజన్ అందివ్వడం, ఐసీయూలో ఉంచి చికిత్స చేయడం కష్టంగా మారింది. ఇప్పుడు ఈ ఇబ్బందులను కొంతైనా తీర్చేందుకు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ-డీఆర్డీవో నిర్విరామంగా కృషి చేస్తోంది. శత్రువులతో యుద్ధ సమయాల్లో మన సైనికులకు అండగా ఉండటమే కాదు కరోనా సంక్షోభంలో ఆస్పత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు తన వంతు బాధ్యత నిర్వహిస్తోంది.
భారీ యుద్ద ట్యాంకులు, మిస్సైల్స్, సైనికులు ఉపయోగించే ఆధునాతన పరికరాలు తయారు చేయడం డీఆర్‌డీఓ పని. అయితే కోవిడ్ సెకండ్ వేవ్‌లో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక వందల సంఖ్యలో రోగులు దేశవ్యాప్తంగా మరణించారు. ఐసీయూ బెడ్లు దొరక్క ఊపిరి వదిలేస్తున్న రోగుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా డీఆర్‌డీవో రంగంలోకి దిగింది.
డీఆర్‌డీవో ఆధ్వర్యంలో యుద్ధ ప్రతిపాదికన కోవిడ్ రోగుల కోసం ఆస్పత్రులు నిర్మిస్తున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, వారణాసి, గాంధీనగర్, హల్దావని, రిషికేష్, జమ్ము, శ్రీనగర్‌లలో ఈ ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 700 ఆక్సిజన్ బెడ్లు, 200 ఐసీయూ బెడ్లతో గాంధీనగర్‌లో ధన్వంతరి కోవిడ్ కేర్ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. అంతకు ముందు న్యూఢిల్లీలో పటేల్ కోవిడ్ కేర్ సెంటర్‌లో 500 బెడ్లను అందుబాటులోకి తెచ్చింది డీఆర్‌డీవో. ఢిల్లీలో మొదలైన ఆక్సిజన్ కొరత సమస్య క్రమంగా దేశం మొత్తాన్ని చుట్టేసింది. ఆక్సిజన్ అందక రోజుకు ఏదో ఒక చోట ఆస్పత్రులో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లపై దృష్టి పెట్టింది డీఆర్‌డీవో. నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలో పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పుతోంది. డీఆర్‌డీవో నిర్మించే ఒక్కో ఆక్సిజన్ ప్లాంటు ద్వారా ఒకే సారి 192 మంది రోగులకు ఆక్సిజన్ అందించే వీలుంది. అంతేకాదు ఈ ప్లాంట్లు ఒకే సారి 195 ఆక్సిజన్ సిలిండర్లను నింపగలవు. ఇప్పటికే రెండు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసింది డీఆర్‌డీవో.
ఢిల్లీలోని ఎయిమ్స్ తో పాటు రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు మే 6 నుంచి పని చేస్తున్నాయి. మరో మూడు ప్లాంట్లు ఢిల్లీలోనే నిర్మాణ దశలో ఉన్నాయి. లేడీ హర్డింగే మెడికల్ కాలేజీ, సఫ్ధార్‌జంగ్ హస్పిటల్, ఝజ్జార్ ఎయిమ్స్ లో ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు జిల్లా స్థాయి ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ ప్లాంటు నెలకొల్పే పనిలో ఉంది డీఆర్‌డీవో.
మరోవైపు డాక్టర్ రెడ్డీస్ తో పాటు మరికొన్ని సంస్థలతో కలసి డీఆర్‌డీవో సంయుక్తంగా 2 డీ జీ పేరుతో యాంటీ కోవిడ్ డ్రగ్ ను అందుబాటులోకి తెచ్చింది. పౌడర్ రూపంలో ఉండే ఈ డ్రగ్ కోవిడ్ బారినపడిన వారికి వేగంగా ఊరటనిస్తుందన్నట్టు పరిశోధనల్లో తేలింది. ఈ మెడిసిన్‌కు డీసీజీఐ కూడా అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. అతి త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 40 శాతం పాజిటివిటీ రేటుతో తీవ్ర సంక్షోభంలో ఉన్న గోవా ప్రభుత్వం ఈ డ్రగ్ వాడకానికి అధికారికంగా సిఫారసు చేసింది. రేపోమాపో ఈ డ్రగ్ మార్కెట్లోకి కూడా అందుబాటులోకి రాబోతోంది. ఇది వస్తే చాలా వరకూ సేఫ్ గా బయటపడే అవకాశాలున్నాయని చెప్తున్నారు.