కాస్త కరుణించు పెద్దన్నా..!

కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ అతలాకుతలమవుతోంది. వ్యాక్సినేషన్‌తో వైరస్ కట్టడి చేయాలనుకుంటే సరిపడా నిల్వలు లేవు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న కోవీషీల్డ్, కోవాగ్జిన్ సరిపోవడం లేదు. స్పుత్నిక్ వి నిల్వలు ఇప్పుడిప్పుడే దేశానికి చేరుకుంటున్నాయి. మరికొన్ని విదేశీ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవాలని భావించినా ఆయా ఉత్పత్తి సంస్థల దగ్గర సరిపడా నిల్వలు లేవు. కొత్తగా ఉత్పత్తి చేసే డోసులే డిమాండ్ ఉన్న దేశాలకు సరఫరా చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు తమ అవసరాల కన్నా ఎక్కువగా వ్యాక్సిన్ కొనుగోలు చేయడమే. వాటిలో అమెరికా ముందుంది.
మోడెర్నా, ఫైజర్, ఆస్ట్రాజెన్‌కా, బయో ఎన్‌టెక్ ఎస్ఈ, జాన్సన్ అండ్ జాన్సన్… ఇలా అన్ని రకాల వ్యాక్సిన్లు కొనుగోలు చేసిన అమెరికా చాలా వేగంగా వ్యాక్సినేషన్ అమలు చేసింది. జులై 4 కన్నా ముందు దేశంలోని 70శాతం జనాభాకు టీకా ఇవ్వాలన్నది అమెరికా లక్ష్యం. 16 ఏళ్ల పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ అమలు చేసిన అమెరికా ఇప్పుడు 12 నుంచి 16 ఏళ్ల వారికి టీకా అందిస్తోంది. టీకా పంపిణీ నిరంతరాయంగా సాగుతోంది. అయితే అత్యవసర వినియోగం కన్నా ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లను అమెరికా కొనుగోలు చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.
టీకా సంస్థలతో ముందే ఒప్పందం కుదుర్చుకోవడం.. వ్యాక్సిన్ నిల్వ ఉంచే, సరఫరా చేసే సదుపాయాలు అమెరికాలో ఎక్కువగా ఉండడం ఆ దేశానికి లాభించింది. టీకాను కొనుగోలు చేసి నిర్దేశిత ప్రాంతాలకు సరఫరా చేసింది. ఇదే ఇతర దేశాలకు ఇబ్బందిగా మారింది. మామూలుగా అన్ని దేశాలు ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్లకు, హెల్త్ కేర్ సిబ్బందికి, వృధ్దులకు వ్యాక్సిన్లు ఇచ్చాయి. అమెరికా మాత్రం అందరికీ వ్యాక్సిన్ అమలు చేస్తోంది.
టీకా అత్యవసరంగా తీసుకోవాల్సిన అవసరం లేని వారికి కూడా అమెరికా వ్యాక్సిన్ ఇస్తోంది. దీంతో మిగిలిన దేశాల్లో ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనూ టీకా దొరకని స్థితి ఏర్పడింది. అలాగే ముందు జాగ్రత్త చర్యగా టీకాలను భారీగా కొనుగోలు చేసింది. దీంతో అమెరికాలో వ్యాక్సిన్లు పెద్దఎత్తున అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో ఆ టీకా నిల్వలను ఇండియాకు అందించాలని అమెరికాకు ఎన్నో వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. అంతర్జాతీయ సమాజంతో పాటు అమెరికా ప్రతిపక్షాలు సైతం మిగులు టీకాను భారత్‌కు ఎగుమతి చేయాలని బైడెన్ ప్రభుత్వానికి సూచించాయి.
కానీ వ్యాక్సిన్ల ఎగుమతిపై బైడెన్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోవడం లేదు. వ్యాక్సిన్ల సంస్థల నుంచి కొనుగోలు చేసిన టీకాలను రాష్ట్రాలకు ఎప్పుడో తరలించేశామని, వాటన్నింటినీ ఇప్పుడు సమీకరించి విదేశాలకు ఎగుమతి చేయడం కష్టమని వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే రానున్న కొన్ని నెలల్లో 6 కోట్ల ఆస్ట్రాజెన్‌కా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను విదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. సంక్షోభ సమయంలో అమెరికా కాస్త కరుణించాలని యావత్ ప్రపంచం కోరుతోంది. మరి పెద్దన్న కరుణిస్తాడో.. లేదో.. వేచి చూడాలి.