అమెరికాలో కోవిడ్ టీకా… తొలి దశ 30 లక్షల డోసులు

అమెరికాలో కోవిడ్ టీకా పంపిణీ చేయనున్నారు. దీని కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఫైజర్-బయోఎన్‍టెక్ టీకాను దేశవ్యాప్తంగా ఉన్న పంపిణీ కేంద్రాలకు పంపించారు. ట్రక్కులు, విమానాల్లో టీకా డోసు బాటిళ్లను బట్వాడా చేస్తున్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద స్థాయిలో వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగనున్నది. తొలి దశలో సుమారు 30 లక్షల టీకాలను ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. నోవెల్ కరోనా వైరస్ వల్ల అమెరికాలో ఇప్పటి వరకు మూడు లక్షల మంది మరణించారు. ఇప్పటికీ రోజుకు సుమారు రెండు వేల పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రానున్న అయిదు లేదా ఆరు నెలల్లో సుమారు మూడవ వంతు జనాభాకు టీకాను అందించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నది.
తొలుత రెండు కోట్ల మంది ఫ్రంట్‍లైన్ హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత కేర్ సెంటర్లలో ఉంటున్న సుమారు 30 లక్షల మంది వృద్ధులకు టీకాను పంపిణీ చేయనున్నారు. అయితే శ్వేతసౌధంలోని ప్రతినిధులకు తొలుత టీకాను ఇవ్వాలని ప్రతిపాదనను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. వైట్‍హౌజ్ సిబ్బంది టీకాను తర్వాత తీసుకుంటుందని, తాను కూడా టీకాను ఇప్పుడే తీసుకోవడం లేదని ట్రంప్ తన ట్వీట్‍లో తెలిపారు. కానీ సరైన సమయంలో టీకా తీసుకుంటానన్నారు.