కరోనా పోవాలంటే మూడేళ్లు పడుతుందా?

భారత్‌లో కరనా సెకెండ్ వేవ్ వణికించేస్తోంది. మరి వైరస్ వ్యాప్తి ఉధృతి తగ్గాలంటే ఎలా? ఇలాగే కొనసాగితే మాత్రం ఇప్పట్లో కంట్రోల్ కావడం కష్టమే. వైరస్ బలహీన పడాలంటే పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ జరగాలి. అంటే 130 కోట్ల మందికి అవసరం లేదు. కనీసం.. 70 శాతం మందికి అంటే 94 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయికి చేరుతుంది. అది జరిగితేనే వైరస్ కంట్రోల్ అవుతుందని నిపుణులు అంటున్నారు. ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. కానీ, మన దేశంలో ఇప్పుడున్న వేగంతో వ్యాక్సినేషన్ కొనసాగుతూ… 70 శాతం మందికి వ్యాక్సిన్లు పూర్తయి… హెర్డ్ ఇమ్యూనిటీ రావడానికి కనీసం మూడున్నరేళ్ల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే 70 శాతం ప్రజానీకానికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన మనదేశంలో 94.5 కోట్ల మందికి టీకా రెండు డోసులూ వేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం 189 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరం.
ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం… ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి 19 కోట్ల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసింది. మరోవైపు వ్యాక్సిన్ డోసుల సరఫరా గురించి కేంద్రం చెబుతున్న మాటలు, రాష్ట్రాల్లో పరిస్థితుల మధ్య పొంతన కుదరడం లేదు. దేశంలో వ్యాక్సిన్‌ల కొరత లేదని, మే 10వ తేదీ నాటికి మొత్తం 17.26 కోట్ల డోసులు ప్రజలకు పంపిణీ చేశామని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి 18 కోట్ల డోసులకుపైనే సరఫరా చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ వెల్లడించారు. దాదాపు కోటి డోసులు వివిధ రాష్ట్రాల వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు.
ఇండియాలో రోజూ దాదాపు మూడున్నర నుంచి నాలుగు లక్షల దాకా కొత్త కరోనా కేసులు వస్తున్నాయి. అదే సమయంలో రోజూ వేస్తున్న వ్యాక్సిన్ల సంఖ్య 30 లక్షలు కూడా దాటట్లేదు. ఫలితంగా జనవరి నుంచి ఇప్పటి వరకూ వేసిన మొత్తం వ్యాక్సిన్ల సంఖ్య 17.27 కోట్లే. ఇదే విధంగా కొనసాగితే సెప్టెంబర్ చివరకు ఎక్కువలో ఎక్కువ మరో 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. అంటే మొత్తం వ్యాక్సిన్లు వేయించుకున్న వారి సంఖ్య 50 కోట్లకు దాటదు. అలాంటి సమయంలో థర్డ్ వేవ్ వస్తే… వ్యాక్సిన్లు వేసుకున్న వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. అదే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తే… వైరస్ బలహీనపడుతుంది. హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే కనీసం మరో 70 కోట్ల మందికి టీకాలు పడాలి. అలా జరగాలంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయాలి. అంటే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. అది కూడా మూడో వేవ్ వచ్చేలోపే వేయాలి.
బ్రిటన్, అమెరికా, ఇజ్రాయెల్, సింగపూర్ లాంటి దేశాల్లో వ్యాక్సిన్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఇండియాలో విదేశీ వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చినా… ఇంకా వాటి లభ్యత పూర్తి స్థాయిలో లేదు. 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అనుమతి ఉన్నా… వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. 45ఏళ్ల లోపు వారికి ఫస్ట్ డోసులు కూడా వేసే పరిస్థితి లేదు. సెకెండ్ డోస్ పెండింగ్ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తూ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. వాటి కోసం కూడా జనాలు విపరీతంగా వ్యాక్సినేషన్ కేంద్రాలపై వచ్చి పడుతున్నారు. అయినా ఉపయోగం ఉండట్లేదు. మరి సమస్య నుంచి ఎప్పుడు బయటపడుతుందో కాలమే సమాధానం చెప్పాలి.