కరోనా కొత్త లక్షణాలు… ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే

కరోనా బాధితుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వరంతోపాటు ఒళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. తలనొప్పి, తీవ్ర నీరసం వంటి సమస్యలతో బాధపడే వారిని పరీక్షించినప్పుడు కూడా పాజిటివ్ వస్తోందని చెబుతున్నారు. కనుగుడ్డు నుంచి సైతం వైరస్ శరీరంలోనికి చేరుతోందని, అలాంటి వారిలో కళ్లు ఎర్రబడుతున్నాయని పేర్కొంటున్నారు. గుంటూరుకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి నాలుగు రోజుల కిందట జ్వరం వచ్చి తగ్గింది. ఒళ్లు నొప్పులు తగ్గడం లేదని, అనుమానంతో పరీక్ష చేయించగా పాజిటివ్‍గా తేలింది. అందుకే ఒళ్లు, కీళ్ల నొప్పుల విషయంలో అశ్రద్ధ చేయొద్దని సీనియర్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. జ్వరంతో విరేచనాలు ఉన్నా ఉపేక్షించవద్దని, వెంటనే కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని పేర్కొంటున్నారు. సెకండ్ వేవ్‍లో ఎక్కువమంది యువత ఈ మహమ్మారి బారిన పడుతున్నట్లు తేలింది. సరిగ్గా మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంతో సమస్యను కొని తెచ్చుకున్నట్లు అవుతోందంటున్నారు వైద్యులు.