దేశంలో కరోనా కల్లోలం.. బ్రెజిల్ ను దాటేసిన భారత్..!

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల తీవ్రత భయంకరంగా పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ఇదే జోరు కొనసాగితే అగ్రరాజ్యం అమెరికాను దాటేయడం కూడా పెద్ద కష్టమేం కాకపోవచ్చు అంటున్నారు నిపుణులు. కానీ దేశంలో మరో నెల రోజుల పాటు కరోనా తీవ్రత మరింత అధికంగా ఉంటుందనే హెచ్చరికలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.
దేశంలో కరోనా సెకెండ్ వేవ్ అంచనాలకు ఏమాత్రం అందట్లేదు. గత 24 గంటల్లో లక్ష 61వేల 736 కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోల్చితే ఈ కేసుల సంఖ్య కాస్త తక్కువే. కానీ ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ సుమారు కోటి 37లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఇక మరణాలు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో 904 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ లక్ష 71వేల మందికి పైగా కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.26శాతంగా ఉంది.
ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో అమెరికా అగ్రస్థానంలోనే ఉంది. ఇన్నాళ్లూ రెండో స్థానంలో బ్రెజిల్ ఉండేది. బ్రెజిల్ లో కోటి 35లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే తొలిసారిగా భారత్ బ్రెజిల్ ను అధిగమించి రెండో స్థానంలోకి వెళ్లింది. భారత్ లో ఇప్పుడు సుమారు కోటి 37 లక్షల కేసులున్నాయి. అమెరికా మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. అక్కడ సుమారు 3 కోట్ల 20 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే అమెరికా టెస్టులు అధికంగా చేస్తుండడం వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే భారత్ లో కూడా టెస్టుల సంఖ్య భారీగా పెరిగింది. అందుకే కేసులు భారీగా నమోదవుతున్నాయని భావిస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కలవరం కలిగిస్తోంది. ప్రతిరోజూ సుమారు 3వేల కేసులు ఇక్కడ నమోదవుతున్నాయి. ఇటీవలికాలంలో తెలుగు రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్య భారీగా పెరిగింది. అందుకే కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాలు సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. సెకండ్ వేవ్ ను ఊహించని ప్రజలు ఇప్పుడు మరోసారి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మాస్కులు సరిగా ధరించకపోవడం, భౌతిక దూరాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని చెప్తున్నారు. అయితే వైరస్ తన క్రమాన్ని మార్చుకోవడం కూడా వైరస్ ఉధృతికి మరో కారణంగా భావిస్తున్నారు. అయితే టీకా అందుబాటులోకి రావడం ఒక్కటే కాస్త ఊరట కలిగిస్తున్న అంశం. అయితే.. టీకా వేసుకున్నవాళ్లకు కూడా కోరనా సోకుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.