కరోనా మరణాలను భారత్ దాచి పెడుతోందా..?

కరోనా వైరస్ ను తొలిసారి చైనాలో 2019 డిసెంబర్ లో గుర్తించారు. ఆ తర్వాత నెల తిరిగేసరికి వైరస్ ప్రపంచం మొత్తం పాకిపోయింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగిన నష్టమెంతో అందరికీ తెలిసిందే. దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ విధించుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రోజుకు పది లక్షల కేసులు.. వేలల్లో మరణాలు అక్కడ సంభవించాయి. కానీ చైనాలో మాత్రం కేసులు ఆగిపోయాయి. మరణాలకూ బ్రేక్ పడిపోయింది. ఇదెలా సాధ్యమైందో ఎవరికీ అంతు చిక్కలేదు. అందరూ చైనా కరోనా కేసులను బయటకు చెప్పట్లేదని.. ఒక్క వుహాన్ నగరంలోనే లక్ష మందికి పైగా చనిపోయి ఉంటారని అనుకున్నారు. వుహాన్ లో శ్మశానాలన్నీ నిండిపోయాయని.. 24 గంటలూ శవాలు కాలుతూనే ఉన్నాయని వార్తలొచ్చాయి. కానీ ఎవరూ దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు.
ఇప్పుడు అదే పరిస్థితి భారత్ కు వచ్చింది. సెకండ్ వేవ్ భారత్ లో అంచనాలకు అందట్లేదని.. కేసులు లక్షల్లో నమోదవుతున్నాయని.. మరణాలు కూడా లెక్కకు అందట్లేదని ప్రపంచ మీడియా కోడైకూస్తోంది. అయితే చైనా లాగా భారత్ కేసులను ఎక్కడా దాచి పెట్టలేదు. అలా దాచిపెట్టే ఉద్దేశమే ఉంటే రోజూ మూడున్నర లక్షకు పైగా కేసులను బయటి ప్రపంచానికి చెప్పదు. అయినా గ్లోబల్ మీడియా మాత్రం భారత్ మరణాలను దాచి పెడ్తోందని.. వాస్తవాలు చెప్పట్లేదని ఆరోపిస్తోంది. ఇందుకు కొన్ని గణాంకాలను కూడా బయట పెడుతోంది.
ప్రస్తుతం భారత్ లో రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు 3వేలకు అటు ఇటుగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇంత మాత్రానికే ఆసుపత్రులన్నీ నిండిపోవడం, ఆక్సిజన్ కొరత ఏర్పడడం, శ్మశానాలన్నీ ఫుల్ అయిపోవడం.. జరుగుతున్నాయి. భారత్ లో రోజుకు కేవలం మూడు వేల మంది చనిపోతే వారి దహన సంస్కారాలు చేయలేని దుస్థితి ఉందా ప్రశ్నిస్తున్నాయి. లాజికల్ గా చూసినప్పుడు ఇదే నిజమేనేమో అనిపిస్తుంది. ఢిల్లీలో రోజూ 3వందల నుంచి 4వందల మంది చనిపోతున్నారు. ఢిల్లీలాంటి మహానగరంలో ఒకరోజులో 3వందల మంది దహన సంస్కారాలను పూర్తి చేసే శ్మశానాలు లేవా.. అని ప్రశ్నిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కూడా ఇదే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం రోజుకు 3వేల వరకూ మరణాలు సంభవిస్తున్నాయి. అయినా ఎక్కడ చూసినా శ్మశానాలు ఫుల్ అయిపోయాయి. ఢిల్లీ లాంటి చోట్ల శవానికి కర్మకాండలు పూర్తి చేయాలంటే కనీసం రెండ్రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. మిగిలిన నగరాల్లో కూడా శ్మశానల ఎదుట శవాల క్యూలు కనిపిస్తున్నాయి. 3 వేల మంది చనిపోతేనే ఈ పరిస్థితి ఉంటే.. ఇంతకంటే ఎక్కువ మరణాలు సంభవిస్తే పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. అందుకే భారత్ మరణాలను దాచి పెడుతోందని.. వాస్తవాలు వేరేలా ఉన్నాయని గ్లోబల్ మీడియా ఆరోపిస్తోంది.