శుభవార్త చెప్పిన వాట్సాప్
కరోనా కష్టకాలంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ శుభవార్త చెప్పింది. లాక్డౌన్ సమయంలో ప్రపంచానికి దూరంగా, ఇంటికే పరిమితమవుతున్న తరుణంలో వాట్సాప్ కీలక ఫీచర్‌ను అప్డేట్ చేసింది. ఇప్పటివరకు నలుగురికి మాత్రమే అవకాశం వున్న వీడియో కాలింగ్ పరిమితిని ఇపుడు ఎనిమిదికి పెంచింది. కరోనా విస్తరణ, లాక్ డౌన్ పరిస్థితుల్లో గ్రూప్ వీడియో, ఆడియో కాలింగ్‌కు ఆదరణ బాగా పెరిగింది.
ఈ నేపథ్యంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ అవకాశాన్ని వాట్సాప్ సమయానుకూలంగా అప్ డేట్ చేసింది. వాబేటా ఇన్ఫో అందించిన సమాచారం ప్రకారం ఈ పెరిగిన పరిమితి ఆండ్రాయిడ్ వాట్సాప్ వీ2.20.133 బీటా, ఐఫోన్ వాట్సాప్ వెర్షన్ 2.20.50.25 బీటాలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. రెండు ప్లాట్ ఫామ్‌లలోని బీటా వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం అయితే యూజర్లు సరికొత్త బీటా వెర్షన్ కలిగి ఉండాలని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ తెలిపింది.













