ఇరాన్ పై అమెరికా మరోసారి కొరడా…
ఇరాన్ పై అమెరికా మరో మారు కొరడా ఝుళిపించింది. ఆ దేశంపై ఐక్యరాజ్య సమితి గతంలో విధించిన ఆంక్షలను తిరిగి విధించిది. జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీవోఏ) నిబంధనలను పాటించడం లో ఇరాన్ విఫలమైందని, అందుకే ఆంక్షలను పునరుద్ధరించామని తెలిపారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. తమకు ఉన్న హక్కుల ప్రకారం భద్రతా మండలి 2015లో విధించిన ఆంక్షలను పునరుద్ధరిస్తున్నట్టు పాంపియో తెలిపారు. నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన తరువాత 30 రోజుల గడువు ముగియడంతో ఆంక్షలు అమలులోకి వచ్చాయన్నారు.
అమెరికా తాజా నిర్ణయం నేపథ్యంలో త్వరలో జరగనున్న ఐక్యరాజ్య సమితి వార్షిక సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన ఇరాన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై అమెరికా ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ తప్పనిసరిగా ఈ ఆంక్షలు అన్నింటినీ పాటించాల్సి ఉంటుందని పాంపియో తెలిపారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమెరికా తాజా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మిత్ర దేశాలు దానిని పట్టించుకోవాల్సిన పని లేదని తీర్మానించాయి. అంతే కాదు, అణు ఒప్పందం నుంచి తప్పుకున్న రోజే ఆంక్షలు విధించే హక్కును అమెరికా కోల్పోయిందని విమర్శించాయి. అయితే, మండలిలో సభ్య దేశంగా ఉన్న తమకు ఆంక్షలు విధించే హక్కు ఉంటుందని అమెరికా వాదించింది.













