ఇఫ్తార్ విందు ఇవ్వనున్న ట్రంప్
ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారని అధ్యక్ష నివాసం వైట్‌హౌస్ వెల్లడించింది. సంప్రదాయాన్ని పక్కనపెట్టి గత ఏడాది ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు ట్రంప్ నిరాకరించారు. అయితే ఈ ఏడాది ఆయన విందు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బుధవారం రోజు అధ్యక్షుడు ఇఫ్తార్ విందు ఇస్తారని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి లిండ్సే వాల్టర్ వెల్లడించారు. అయితే విందుకు ఎవరెవరిని ఆహ్వానిస్తారు, ఈసారి ఇఫ్తార్ విందు ఇవ్వాలని అధ్యక్షుడు ఎందుకు నిర్ణయించుకున్నారనే అంశాలపై సమాధానం చెప్పేందుకు వైట్‌హౌస్ నిరాకరించింది. గతంలో ముస్లింలకు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న చర్యలను సమర్థించిన కొందరు, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలోకి ప్రవేశించకుండా గతంలో ట్రంప్ అయిదు ముస్లిం దేశాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పాలసీ అక్కడి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.













