అధ్యక్ష పదవికి ఆయన తగిన వ్యక్తి కాదు: కమలా హారిస్
అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్ అభ్యర్థిగా ఎంపికైన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ తన తొలి ఎన్నికల ప్రసంగంలోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధ్యక్ష పదవికి ఆయన తగిన వ్యక్తి కాదని విమర్శించారు. ట్రంప్‌లో నాయకత్వ లక్షణాలు లేకపోవడంతో అమెరికా వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆరోపించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌తో కలిసి కమల విల్లింగ్టన్లో తొలి ఎన్నికల ప్రసంగం చేశారు. కరోనా వైరస్ కారణంగా ఈ సమావేశాన్ని ప్రజల మధ్య నిర్వహించలేదు. బైడెన్, హారిస్‌లు ఇద్దరూ మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ మీడియాతో మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ పాలనా యంత్రాంగం గందరగోళం సృష్టిస్తోందని అధ్యక్షుడు ట్రంప్‌పైనా, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మీద కచ్చితంగా కేసు వేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రజల సంక్షేమానికి కొత్త చట్టాలు తెస్తామని, వాతావరణ మార్పులపై పోరాడతామని బైడెన్, హారిస్‌లు కలసికట్టుగా హామీ ఇచ్చారు.













