అమెరికాకు ప్రయోజనకరమైతేనే… ఆ ఒప్పందం!
అమెరికాకు ప్రయోజనకరంగా వుంటేనే చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టం చేశారు. చైనాతో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆయన వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చిలో చైనా నుండి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై భారీ స్థాయిలో ట్రంప్ దిగుమతి సుంకాలను పెంచటంతో ప్రపంచంలో రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య పోరు మొదలైంది. చైనాకు చెందిన 25వేల కోట్ల డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా 25 శాతం మేర సుంకాలను పెంచగా, దీనికి ప్రతీకారచర్యగా అమెరికన్ దిగుమతులపై దాదాపు 11 వేల కోట్ల డాలర్ల మేర సుంకాలను చైనా విధించింది. ఇరుదేశాల మధ్య తలెత్తిన ఈ వాణిజ్య పోరు ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీసే అవకాశముందని ఆర్థిక వేత్తలు ఇప్పటికే హెచ్చరించారు.
చైనాతో వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న విశ్వాసం తనకుంది. అయితే, దేశం కోసం మంచి ఒప్పందం కుదిరితే సరే, లేకుంటే ఒప్పందమే కుదుర్చుకోను అని ట్రంప్ చెప్పారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందమేదీ లేకపోవటంతో చైనా దిగుమతులపై అదనపు సుంకాలను విధిస్తానంటూ ట్రంప్ బెదిరింపులకు దిగారు. వాణిజ్య ఒప్పందానికి తుది రూపు ఇచ్చేందుకు ఫ్లోరిడా రిసార్ట్ మార్- ఎ- లాగోలో చైనా అధ్యక్షుడితో భేటీ అవుతానని గత నెలలో ట్రంప్ ఓ సందర్భంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.













