స్వీడన్ లో ఘనంగా తెలుగు భాషాదినోత్సవం
స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో తెలుగు సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌కు చెందిన ప్రవాస కుటుంబాల వారు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐదు నుంచి పదిమేను సంవత్సరాల చిన్నారులకు ప్రాథమిక, మాధ్యమిక విభాగాల్లో తెలుగు చదవడం, రాయడం, కథాకథనం, క్విజ్, పద్యాలు గేయాలు వంటి అంశాల్లో పోటీలు నిర్వహించారు. వీటిలో పెద్ద సంఖ్యలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు కార్యక్రమం చివరలో ధ్రువీకరణపత్రాలు, బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా తెలుగు సమాజం చైర్మన్ సురేంద్ర అలుగునూల మాట్లాడుతూ పిల్లలకు తెలుగు పట్ల ఆసక్తిని కలిగించేందుకు పోటీలు నిర్వహించామన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు జరుపుతామని, దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు సమాజం సభ్యులు ప్రవీణ్, గంగాధర్, నిరంజన్, రమ, దీపిక, రమేష్, ప్రత్యూష, భూపతి పాల్గొన్నారు.













