“సంప్రదాయ న్యూస్ మీడియా మీద వత్తిడి పెరిగింది”
పెరుగుతున్న ఆధునిక ప్రచార, ప్రసార మాధ్యమాల కారణంగా సంప్రదాయ మీడియా మీద తీవ్రమైన వత్తిడి పెరుగుతున్నట్టి రాయిటర్స్ ఇన్ స్టిట్యూట్ అభిప్రాయపడుతోంది. ప్రజలకు వార్తలను ఎప్పటికప్పుడు తెలియ జేయటానికి ఎలక్ట్రానిక్ మీడియా ఒక్కటే మార్గమని అనుకుంటున్న సమయంలో సామాజిక మాధ్యమాల ప్రభావం అనూహ్యంగా పెరగటంతో సంప్రదాయ వార్తా మాధ్యమాలు వత్తిడికి లోనవుతున్నాయని వ్యాఖ్యానించింది.
ఈ వత్తిడి కారణంగా దాని ప్రభావం బాగా పడిపోవటం ఒక వంతయితే, ఆదాయం కూడా పడిపోవటం మరో వంతని రాయిటర్స్ గుర్తించింది. డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక, ఫ్రాన్స్, జర్మనీ ఎన్నికలు ఈ విషయాన్ని రుజువు చేశాయని ఉదహరించింది. ఆన్ లైన్ అడ్వర్టయిజింగ్ ప్రభావం ఎంతగా ఉంటుందో, ఎంత భారీగా పెంచుకోవటానికి అవకాశముందో టెక్ ప్లాట్ ఫామ్స్ 2016 అంతటా నిరూపించాయని కూడా రాయిటర్స్ పేర్కొంది. అనేక మార్కెట్లలో పత్రికల ఆదాయం గణనీయంగా పడిపోవటం, ఉద్యోగాలలో కోత విధించటం, కొన్ని సంస్థలు మూత పడటం అందుకు నిదర్శనమని పేర్కొంది.
అమెరికాలో దాదాపుగా ఎదుగుదల మొత్తం (99%) డిజిటల్ అడ్వర్టయిజింగ్ లోనే ఉందని, అది కూడా గూగుల్ లేదా ఫేస్ బుక్ మాత్రమే పంచుకుంటున్నాయని గుర్తించింది. జర్నలిజం, మీడియా అండ్ టెక్నాలజీ: ట్రెండ్స్ అండ్ ప్రెడిక్షన్స్ 2017 పేరుతో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అయితే, ప్రింట్ నుంచి డిజిటల్ కు మారే క్రమంలో పత్రికలు నానా రకాలుగా ప్రయాస పడటం కనిపించిందని కూడా అందులో పేర్కొన్నారు. ఇంటర్నెట్. స్మార్ట్ ఫోన్ యాప్స్ , సోషల్ మీడియా లాంటి మార్గాలు ఎంచుకుంటూ ఆదాయాలకోసం ప్రయత్నించటాన్ని గుర్తించింది.
ఇకమీదట టెక్ ప్లాట్ ఫామ్స్ ప్రభావం గురించి మీడియాలో తీవ్రమైన చర్చ జరగక తప్పదని, వాటి ప్రభావం గురించి, పాత్ర గురించి, ఏ మేరకు ఆ కార్యకలాపాలను నియంత్రించాల్సిన అవసరముంది… అనే అంశాల గురించి కూడా చర్చ జరిగే అవకాశముంది. తప్పుడు వార్తల వలన జరుగుతున్న అనర్థాల దృష్ట్యా మొత్తంగా మాధ్యమాల మీద విశ్వసనీయత తగ్గిపోయే ప్రమాదం ఉండటం వలన తక్షణమే స్పందించాల్సిన అవసరాన్ని సంప్రదాయ మీడియా గుర్తించింది.
అలా నియంత్రించటం వలన మాత్రమే తమ ప్రాధాన్యాన్ని నిలుపుకోగలమని భావిస్తోంది. అదే సమయంలో అలాంటి విశ్వసనీయతలేని మీడియాతో పోటీకోసం దిగజారనవసరం లేదని కూడా నిర్ణయించుకుంది. తప్పుడు వార్తల సమస్యను ఫేస్ బుక్ నియంత్రించలేకపోయినా ఆటోమేటిక్ పిక్చర్ రికగ్నిషన్ లాంటి ఆధునిక సాంకేతిక విధానాల సాయంతో కొంతమేరకైనా విశ్వసనీయత పొందగలిగే అవకాశముంటుందని సంప్రదాయ మీడియా అభిప్రాయపడుతోంది.













