అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఎన్నారైలు ఎటువైపు?
చాలా సంవత్సరాలుగా భారతీయులు ఎక్కువగా డెమొక్రాట్స్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నది వాస్తవం. అమెరికాలో దాదాపు 1.8 మిలియన్ భారతీయ ఓటర్లు ఉన్నందున రెండు పార్టీలకు ఈ భారతీయ వోట్లు చాలా కీలకం. భారత దేశానికి చెందిన ఐటీ ఉద్యోగులపై ఇమ్మిగ్రేషన్ ఆంక్షలు విధించిన ట్రంప్‌పై కొంత వ్యతిరేకత వచ్చిన మాట నిజమే. చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్, ఐటీ ఎంటప్రెన్యూరర్స్ గత 4 సంవత్సరాలుగా ట్రంప్ మీద వ్యతిరేకత పెంచుకున్నారు. అందువలనే బైడెన్ కూడా ఈ విషయాన్ని చెబుతూ భారతీయులను ఆకట్టుకునే విధంగా మాట్లాడి వారి మద్దతును సంపాదించడం మొదలు పెట్టారు.
ఆ తరువాతే భారత సంతతికి చెందిన కమలాహారీస్ని వైస్ ప్రెసిడెంట్ పదవికి నామినేట్ చేయగానే భారతీయ కమ్యూనిటీ డెమొక్రటిక్ పార్టీకి మరింత దగ్గయిందని విశ్లేషకులు అంటారు. అయితే భారతీయ కమ్యూనిటీని ట్రంప్ 2016 ఎన్నికల ముందు నుంచే ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందుకనే భారతీయులు ఎక్కువగా ఉన్న స్వింగ్ స్టేట్స్ అయిన పెన్సిల్వేనియా, మిచిగన్, ఫ్లోరిడాలలో 2016లో ట్రంప్‌కు మంచి మద్దతు లభించి గెలుపును సాధించారు. అధ్యక్ష పదవిలోకి వచ్చిన తరువాత కూడా హిందుత్వ మీద తన అభిప్రాయం చెబుతూ ప్రధాని మోడీకి రెగ్యులర్‌గా అభినందనలు తెలుపుతూ, ఇండియాతో స్నేహం మొదలెట్టారు. కొన్ని నెలల క్రితం హ్యూస్టన్‌లో హౌడీ మోడీ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడంలో ట్రంప్ ప్రోత్సాహం ఉందని అంటారు.
ఈ కార్యక్రమానికి ట్రంప్ స్వయంగా హాజరై దాదాపు 50000కు పైగా ఉన్న పబ్లిక్‌లో మోదీతో కలిసి భారతీయులకు అభివాదాలు తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే మోదీ కూడా ట్రంప్‌ను ఇండియాకు ఆహ్వానించి దాదాపు 110000 మందితో నమస్తే ట్రంప్ పేరుతో కార్యక్రమాన్ని చేశారు. ఈ రెండు కార్యక్రమాలకు హాజరవడం ద్వారా భారతీయుల మనస్సును ట్రంప్ ఆకట్టుకున్నారు.
గత 2 సంవత్సరాలలో ముఖ్యంగా గత 8 నెలల్లోనూ ట్రంప్ ప్రభుత్వం పాకిస్తాన్ మీద, తరువాత చైనా మీద చాలా కఠినమైన వైఖరిని ప్రదర్శించడం ప్రారంభించింది. భారతదేశానికి అనుకూలంగా ఉంటూ, ప్రత్యర్థులుగా ఉన్న పాక్, చైనాపై ట్రంప్ ప్రదర్శిస్తున్న వైఖరి భారత కమ్యూనిటీని ఆకట్టుకుంది. మరోవైపు బైదెన్, కమలాహారీస్ ఇద్దరూ కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై పాక్‌కు మద్దతుగా పరోక్షంగా కామెంట్లు చేయడంతో భారత కమ్యూనిటీకి చెందిన చాలామంది ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఏదీ ఏమైనా భారత కమ్యూనిటీ భారత దేశానికి మద్దతుగా పాక్, చైనాపై కఠినంగా ఉంటున్న ట్రంప్‌పై అభిమానాన్ని పెంచుతున్నారు. ట్రంప్ అధ్యక్షునిగా ఉంటేనే భారత దేశానికి చాలా ఉపయోగమని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిటీ మద్దతుతో ట్రంప్ గెలవడం ఖాయమని చెప్పవచ్చు.













