ఎన్నికల ప్రచారంలో ఎన్నారైలు
అమెరికాలో ఉంటున్న ఎన్నారైల ప్రచారం ఆయా పార్టీలకు ఎంతగానో మేలును కలిగించింది. వీరంతా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తమ పార్టీపై ఉన్న అభిమానంతో తమ పార్టీని గెలిపించుకునేందుకు అమెరికా నుంచి రాష్ట్రానికి వచ్చి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. వీరితోపాటు పలువురు సామాజిక మాధ్యమ వేదికగా తమ తమ పార్టీలకు మద్దతుగా పోస్టులు పెడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణలో కూడా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అమెరికాలోని టీఆర్ఎస్ ఎన్నారై విభాగం కూడా ముమ్మరంగా పాల్గొంది.
ఎపిలో ఎన్నారై టీడిపి ప్రచారం
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అమెరికాలో ఎన్నారై టీడిపి అనుబంధ విభాగంగా ఉంటోంది. దాదాపు 14 ఏళ్ళుగా ఇది తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తోంది. ఎన్నారై టీడిపికి సమర్థనాయకత్వం, అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. దేశంలో జాతీయ పార్టీలకు విభాగాలు ఉన్నా, ఇలా విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించిన చరిత్ర మాత్రం దేనికీ లేదు. అది ఒక్క తెలుగుదేశం పార్టీకే లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తోడుగా నవ్యాంధ్ర ప్రగతికోసం ఎన్నారై టీడిపితోపాటు ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఎపిఎన్ఆర్టీ కూడా తీవ్రంగా శ్రమించింది. కాగా గత ఎన్నికల్లో పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమించిన ఎన్నారై టీడిపి ఈసారి కూడా తనవంతుగా ఎన్నికల్లో గెలుపుకోసం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఎన్నారై టీడిపి అగ్రనేత జయరామ్ కోమటి ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయనతోపాటు సతీష్ వేమన, కేసి. చేకూరి, లోకేష్ నాయుడు, నవీన్ ఎర్రమనేని, సునీల్ పాంత్రా, వెంకట్ కోగంటి, సుమంత్ పుసులూరి, దిలీప్ కుమార్, ప్రసాద్ మంగిన తదితరులు కూడా ప్రచారరంగంలోకి దిగారు. ఎపిఎన్ఆర్టీ తరపున రవి వేమూరు, బుచ్చిరాంప్రసాద్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. చాలామంది ఎన్నారైలు సమయం సరిపోక ఆంధ్రప్రదేశ్‌కు రాలేకపోయినా అమెరికా నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. న్యూజెర్సి, సిలికాన్‌వ్యాలీలో, డిట్రాయిట్ తదితర ప్రాంతాల్లో ఉన్న టీడిపి అభిమానులు తమకు తెలిసిన ఎన్నారైలను, వారి బంధువులను తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ ప్రచారం చేశారు. మహిళా ఎన్నారైలు కూడా టీడిపికి మద్దతుగా రంగంలోకి దిగడం విశేషం.
ఎన్నారై టీడీపి ఎలా వచ్చింది?
అమెరికాలో ఎన్నారై టీడిపికి పెద్ద సంఖ్యలో సభ్యులు ఉన్నారు. తాము అమెరికా రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరించిన ఐటీ అనుకూలవైఖరినే కారణమని వారు చెబుతారు. ఆయన గెలుపు తమకు ముఖ్యమని ఎన్నారైలు అంటారు. అమెరికా లో 2007 లో కొందరు ప్రముఖులు సమావేశమై తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఏ విధంగా వ్యవహరించాలన్న విషయమై ఆలోచించారు. చర్చలు, సమావేశాల తరువాత తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎన్నారై టీడిపిని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నారై టీడిపి ఏర్పాటు వెనుక తానాలో ఉంటూ, తెలుగుదేశం పార్టీలో చేరిన జయరామ్ కోమటితోపాటు, తానా అధ్యక్షునిగా పనిచేసిన నాదెళ్ళ గంగాధర్ మరియు ఇతర నాయకులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయానికి ఎల్లప్పుడూ నిరంతరం పాటుపడుతున్న ఎన్నారై తెలుగుదేశం పార్టీ విభాగం 2007లో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీకి స్వచ్ఛంద అనుబంధ సంస్థగా దీనిని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉంటున్న ప్రముఖులైన డా. రాఘవేంద్ర ప్రసాద్, డా. నవనీతకష్ణ, డా. కొత్తపల్లి శ్రీనివాస్, పద్మశ్రీ ముత్యాల, ఉదయ్ చాపలమడుగు, శ్రీనివాస్ చందు, లక్ష్మీనారాయణ సూరపనేని, చలమా రెడ్డి, యుగంధర్ ఎడ్లపాటి, బ్రహ్మాజీ, కిషోర్ పుట్టా, డా. హనుమయ్య బండ్ల, హేమప్రసాద్ వంటివారు చంద్రబాబుకు మద్దతుగా ఉంటున్నారు.
ఎపిఎన్ఆర్టీతో పెరిగిన అభిమానులు
అమెరికాలో ఉన్న ఎన్నారైలతోపాటు వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలను ఒకే ప్లాట్‌ఫామ్ మీదకు తెచ్చేందుకు వీలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎపిఎన్‌ఆర్‌టీని ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షునిగా అమెరికాలో ఉన్న రవి వేమూరును నియమించింది. ఈ విభాగం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వ ఆశయాలను, ప్రభుత్వ పథకాలను విస్తతంగా వ్యాపింపజేసింది. అలాగే ఎన్నారైలకోసం చేస్తున్న కార్యక్రమాలను కూడా తెలియజేసింది. దీంతో టీడిపికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. ఓవైపు ఎన్నారై టీడిపి, మరోవైపు ఎపిఎన్ఆర్టీ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు ఎంతోమంది ఎన్నారైలను తెలుగుదేశం పార్టీవైపు చూసేలా చేసింది.దాంతో వారంతో ప్రచారం లో దిగారు.
డిజిటల్ మీడియా వ్యాన్ల ద్వారా ప్రచారం
2019 ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో కూడా తెలుగు దేశం పార్టీ తరపున ప్రచారాన్ని నిర్వహించేందుకు ఎంతోమంది ఎన్నారైలు రాష్ట్రానికి వచ్చారు. గత ఎన్నికల్లో బ్రింగ్ బాబు బ్యాక్, జాబు కావాలంటే బాబు రావాలంటూ స్లోగన్‌తో ఎన్నారైలు చేసిన ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. ఈ ఎన్నికల్లో కూడా ఎన్నారైలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేశారు. మళ్ళీ నువ్వే రావాలి అన్న నినాదంతో ప్రజ ల్లోకి దూసుకెళ్ళారు.
ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాతోపాటు, ప్రత్యక్షంగా ప్రజలకు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు డిజిటల్ మీడియా వ్యాన్లను ఏర్పాటు చేసి దాని ద్వారా వివిధ చోట్ల ప్రచారం నిర్వహించారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో కూడా ఎన్నారై టీడిపి నాయకులు ముందుంటున్నారు.
వైఎస్ఆర్పికి మద్దతుగా ఎన్నారైల ప్రచారం
రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి మద్దతుగా ప్రచారం చేసేందుకు పలువురు ఎన్నారైలు రాష్ట్రానికి తరలివచ్చారు. వారిలో కొందరు బస్‌యాత్ర చేపట్టారు. తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రం ముందుకు వెళ్ళలేదని, వైఎస్ఆర్ పాలన మళ్ళీరావాలంటే జగన్‌ను గెలిపించాలని వారు కోరారు. రావాలి జగన్ కావాలి జగన్ పేరుతో వారు ప్రచార యాత్ర చేపట్టారు. మరికొంతమంది వైఎస్ఆర్సిపి అభిమానులు సామాజిక మాధ్యమం ద్వారా జగన్‌కు మద్దతుగా ప్రచారాన్ని చేపట్టారు కిరణ్ కందుల, ప్రతాప్ భీమ్‌రెడ్డి, కుర్రి ఉమామహేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రవిరెడ్డి. రాఘవరెడ్డి గోశాల, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, ఇస్మాయిల్ పెనుకొండ, సురేష్, శ్రీనిరెడ్డి వంగిమళ్ల వంటి వారు తమ ఫేస్బుక్లో వైఎస్ఆర్సిపికి మద్దతుగా ప్రచారం చేశారు.
అమెరికాలో వైఎస్ఆర్సిపికి ఎంతోమంది మద్దతుదారులు ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి, జయంతి కార్యక్రమాలు, జగన్ పుట్టినరోజు వేడుకలు వంటి వాటితోపాటు ఎన్నో సేవా కార్యక్రమాలను వారు నిర్వహిస్తున్నారు. అమెరికాకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులతో మీట్ అండ్ గ్రీట్ వంటి కార్యక్రమాలను కూడా వారు ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా ప్రచారాన్ని వారు అమెరికాలో అన్నీ ఊర్లలో చేస్తుంటారు.
జనసేనకు మద్దతుగా ఎన్నారైలు
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేనను గెలిపించడానికి పలువురు ఎన్నారైలు రంగంలోకి దిగారు. గ్లోబల్ ఎన్నారై డాక్టర్స్ పేరుతో కొంతమంది ఎన్నారై డాక్టర్లు కూడా ఈ ప్రచారంలో పాల్గొని రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ హాస్పిటల్లో గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ఆసుపత్రులలో టీతోపాటు గాజు గ్లాస్‌ను పంపిణీ చేశారు.
బిజెపికి మద్దతుగా…
రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా అమెరికాలోని ఆఫ్ బిజెపి యుఎస్ఎ కార్యకర్తలు ప్రచారం చేశారు. దాంతోపాటు నమో మోదీ పేరుతో వివిధ చోట్ల ప్రచార సమావేశాలను కూడా నిర్వహించారు. మోదీ మళ్ళీ ప్రదాని కావాలంటూ హోమాలు కూడా చేశారు. ఆఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు కృష్ణారెడ్డి ఏనుగుల, సీనియర్ ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ నేతలు ప్రమోద్ భగత్, విలాస్ రెడ్డి జంబుల, ఆత్మ సింగ్, గుంజన్, శ్రీకాంత్, సంతోష్, దినేష్ వంటివారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ప్రచారం
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్రసమితికి మద్దతుగా టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. సారు కారు పదహారు అన్న నినాదంతో తాము ప్రచారం చేసినట్లు టీఆర్ఎస్ ఎన్నారై విభాగం కో ఆర్డినేటర్ మహేష్ బిగాల చెప్పారు. సామాజిక మీడియా ద్వారా కూడా తమ విభాగం టీఆర్ఎస్ గెలుపుకు ప్రచారం చేసినట్లు ఆయన తెలిపారు. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఉన్న ఎన్నారై విభాగాలు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నాయని మహేష్ బిగాల వివరించారు.
కాంగ్రెస్‌కు మద్దతు
తెలంగాణలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పలువురు ఎన్నారైలు ప్రచారం చేశారు. ఎన్నారై మధుయాష్కి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిజామాబాద్‌లోనూ, మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డికి మద్దతుగా ఎన్నారైలు ప్రచారం ప్రచారం చేశారు. ఎన్నారై రాజేశ్వర్ రెడ్డి గంగసాని తదితరులు కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరారు.
టీడిపి గెలుపు కోసం కృషి చేసిన టీమ్‌లు
ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును గెలిపించాలని కోరుతూ ఎన్నారై టీడిపితోపాటు ఎన్నో టీమ్‌లు నిర్విరామంగా కృషి చేశాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూనే, మరోవైపు ప్రత్యక్షంగా జనాలను కూడా చైతన్యవంతం చేస్తూ పార్టీకి అందరూ ఓటు వేసే విధంగా ఈ టీమ్‌లు ప్రయత్నించాయి. సిబిఎన్ ఆర్మీ, బెంగళూరు టీడిపి ఫోరం, చెన్నై టీడిపి ఫోరం, ఎపి ఫస్ట్ టీమ్, ఎపి విత్ సిబిఎన్ టీమ్, బి విత్ బాబు టీమ్, ప్రైడ్ ఆఫ్ ఆంధ్రా టీమ్, నారి ఫర్ నారా టీమ్, ఎన్నారై టీడిపి యుఎస్ఎ, ఎన్నారై డల్లాస్ టీమ్, ఎన్నారై టీడిపి ఆస్ట్రేలియా, ఎన్నారై టీడిపి సింగపూర్, ఎన్నారై టీడిపి యుకె, యూరప్, ఎన్నారై టీడిపి గల్ఫ్, కువైట్, ఎన్నారై టీడిపి మలేషియా వంటి టీమ్‌లు టీడిపికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి.
ఓటు వేసిన ఎన్నారైలు
ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటు వేయడంకోసం ఎంతోమంది ఎన్నారైలు విదేశాల నుంచి ఆంధ్రకు తరలివచ్చారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పెద్ద సంఖ్యలో ఎన్నారై తెలుగువారు ఓటు వేశారని, అమెరికా సహా వివిధ దేశాల నుంచి వచ్చిన దాదాపు 5200 మందితమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరి తెలిపారు.













