ఎపి ప్రగతిలో మీరు కూడా చేయి కలపాలి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్నారైలు కూడా పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్తున్నట్లు గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. అట్లాంటాలో ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ శాఖ ఏర్పాటు చేసిన సమావేశశంలో తెలంగాణ తెదేపా నాయకుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అట్లాంటా ఎన్ఆర్ఐ తెదేపా నాయకులు మల్లిక్ మేదరమెట్ల, లావు అంజయ్య చౌదరి రూపొందించిన రాజధాని నిర్మాణం- ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
నవ్యాంధ్ర రాజధాని రూపకల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతున్నారని మన్నవ వివరించారు. అమరావతి నిర్మాణములో ప్రవాసాంధ్రులు చూపుతోన్న చొరవ, చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమన్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు మంచి అవకాశం ఉండటంతో ప్రవాసాంధ్రులకు ఇది మంచి తరుణమన్నారు. రాజధాని నిర్మాణములో ప్రతి ఒక్కరూ మరింత భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా వారి ద్వారా మెడికల్ క్యాంపు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. తామా చైర్మన్ నగేష్ దొడ్డక, ఉచిత సేవలు అందిస్తున్న డా.శ్రీహరిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
అమెరికాలో వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉండని పరిస్థితిలో, ముఖ్యంగా ఇండియా నుంచి అమెరికాకు విజిటింగ్ వీసా మీద వచ్చే ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు, బంధువులు వైద్య సేవలు పొందాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదని చెప్పారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరము ఎంతో ప్రయోజనకరముగా ఉంటుందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా సుమారు 2700 మంది ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా ప్రవాసాంధ్రులు లబ్ది పొందారన్నారు. తెలంగాణ తెదేపా నాయకులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్వేయంగా చంద్రబాబు నూతన రాజధాని నిర్మిస్తున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో, ప్రపంచంలోని తెలుగు వారినీ అందరినీ భాగస్వాములను చేస్తూ రాజధాని నిర్మించడం ద్వారా అభివృద్ధి వేగవంతంగా సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిక్ మేదరమెట్ల, అంజయ్యచౌదరి, డా.శ్రీహరి, వెంకి గద్దె, వినయ్ మద్దినేని, మురళీ బొడ్డు, శ్రీనివాస్ రాయపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.













