తెలుగుజాతికి కూచిపూడి జీవనాడి : బుద్ధ ప్రసాద్
భారతీయ కళా రూపాల్లో కూచిపూడి నృత్యం ప్రపంచ ప్రఖ్యాతి సాధించడం ఎంతో గర్వకారణమని, తెలుగుజాతికి కూడిపూడి జీవనాడి వంటిదని ఏపీ శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవవ్లో భాగంగా షికాగో నగరంలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన శివశ్రీ నృత్య కళానికేతన్ నిర్వాహకులు రఘుపాత్రని శ్రీకాంత్ చేసిన నృత్య ప్రదర్శన సభికుల ప్రశంసలు అందుకుంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పోటీలు నిర్వహించి 36 కళారూపాలను ఎంపిక చేసింది. వీటిలో శ్రీకాంత్ కూచిపూడి నృత్య ప్రదర్శన ఒకటి. షికాగోలోని నృత్య ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుద్ధప్రసాద్ హాజరై రఘుపాత్రని శ్రీకాంత్‌ని సత్కరించారు. కార్యక్రమంలో భారత కాన్సుల్ ప్రతినిధి వినోద్ గౌతమ్, ఇండియా హబ్ నిర్వాహకులు వినోజ్ చనుమోలు, శ్రీరామ్ శొంఠి, అపర్ణ అప్పలరాజు తదితరులు ప్రసంగించారు.













