ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మళ్లీ ఆయనే!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మళ్లీ అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బిజోస్ నిలిచారు. ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాను విడుదల చేసింది. 141.9 బిలియన్ డాలర్ల సంపదతో బిజోస్ అపర కుబేరుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. జూన్ 1 నుంచి బిజోస్ సంపద దాదాపు 5 బిలియన్ డాలర్లు పెరిగింది. గతేడాది కూడా ఆయనే బిలియనీర్ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానంలో 92.9 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ వ్వవస్థాపకుడు బిల్గేట్స్ ఉండగా, 82.2 బిలియన్ డాలర్ల సంపదతో వారెన్ బఫెట్ మూడో స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో యాపిల్ తర్వాత అమెజాన్ ఉంది. ఇక అమెరికాలోని అతిపెద్ద కంపెనీల్లో 177.87 బిలియన్ డాలర్ల ఆదాయంతో అమెజాన్ ఎనిమిదో స్థానంలో ఉంది.
ఈ జాబితాలో టాప్ 100లో నలుగురు భారతీయులకు మాత్రమే చోటు దక్కింది. 40.1 బిలియన్ డాలర్ల సంపదతో ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 19వ స్థానంలో ఉన్నారు. ఇక అజీమ్ ప్రేమ్ జీ 18.8 బిలియన్ డాలర్ల సంపదతో 58వ స్థానంలో ఉండగా, లక్ష్మీ మిట్టల్ 18.5 బిలియన్ డాలర్ల సంపదతో 62వ స్థానం, శివ నాడర్ 14.6 బిలియన్ డాలర్ల సంపదతో 98వ స్థానంలో ఉన్నారు.













