కరోనా శతకం పుస్తకాన్ని ఆవిష్కరించిన జయ్ తాళ్ళూరి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు జయ్ శేఖర్ తాళ్ళూరి కరోనా శతకం పుస్తకాన్ని నేడు ఆవిష్కరించారు. న్యూయార్క్ లో కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ రచించిన ఈ పుస్తకాన్ని జయ్ తాళ్ళూరి ఆవిష్కరిస్తూ, ప్రపంచ దేశాలు కరోనా భయంతో వణకిపోతున్న ఈ సమయంలో ఆత్మస్థ్తెర్యంతో క్రమశిక్షణతో యుద్ధం నిర్వహిస్తే గెలుపు తధ్యమని, తరతరాలుగా ప్రకృతికి దూరమై కలుషితం చేస్తూ, సర్వజీవులకు కీడు తలపెడుతూ భూమికే ప్రమాదకారిగా మారిన మనిషికి ప్రకృతి పాఠం చెప్పదలచుకున్నదని కవి ఈ పద్యాలలో చెప్పడం బాగుందని అన్నారు. ఈ కరోనా శతకం చదివించేలా ఉందన్నారు.
కాగా గతంలో చిగురుమళ్ళ శ్రీనివాస్ రచించిన అమ్మానాన్న గురువు శతక పద్యార్చన కార్యక్రమాన్ని తానా ప్రపంచం అంతా ఒకేరోజు నిర్వహించి చిన్నారులచేత పద్యాలు పాడించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికానూ, ప్రపంచదేశాలను పీడిస్తున్న కరోనాపై కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ రచించిన కరోనా శతకం పుస్తకాన్ని జయ్ తాళ్ళూరి ఆవిష్కరించడం విశేషం. కవి చిగురమళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన జయ్ తాళ్ళూరి గారికి ధన్యవాదాలు అంటూ, తానా కార్యవర్గ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.













