ITServe Synergy: ఘనంగా జరిగిన ఐటీసర్వ్ సినర్జీ 2025.. కాన్ఫరెన్స్ తేదీ ఖరారు
ఐటీసర్వ్ అలియన్స్ (ITServe Alliance) ఆధ్వర్యంలో సినర్జీ 2025 కార్యక్రమం తొలిసారిగా యూఎస్ బయట జరిగింది. పోర్టారికో వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీసర్వ్ అలియన్స్ వార్షిక కాన్ఫరెన్స్‌ను ఈ ఏడాది డిసెంబర్ 4-5 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు సినర్జీ 2025 డైరెక్టర్ మనీష్ మెహ్రా ప్రకటించారు. వెస్టాన్ హోటల్ బాల్‌రూంలో జరిగిన సినర్జీ 2025 కార్యక్రమంలో 500 ఐటీసర్వ్ సభ్యులు, ఆంత్రప్రెన్యూర్లు, స్పాన్సర్లు, పలువురు బిజినెస్ మ్యాగ్నెట్లు పాల్గొన్నారు.
మెహ్రా నేతృత్వంలోని సినర్జీ లీడర్ల బృందం ఈ కార్యక్రమం ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో సుబ్రహ్మణ్యం ఒసురు నేతృత్వంలోని న్యూజెర్సీ ఛాప్టర్తోపాటు ఈస్ట్ కోస్ట్ ప్రాంతానికి చెందిన బోస్టన్, డీఎంవీ, మేరీల్యాండ్, న్యూఇంగ్లండ్, న్యూజెర్సీ, న్యూయార్క్, ఫిలడెల్ఫియా ఛాప్టర్లు కీలకపాత్ర పోషించాయి. ఈ సందర్భంగా సినర్జీ 2025 విజువల్ ప్రెజంటేషన్, సినర్జీ జర్నల్ కవర్ పేజిని విడుదల చేసిన సినర్జీ లీడర్లు.. ప్లాటినం, ఎలైట్, డైమండ్ మెంబర్లకు అందుతున్న అద్భుతమైన లాభాలను వివరించారు. ఈ క్రమంలో అసలు ఐటీసర్వ్ ఎలా ప్రారంభమైందో గవర్నింగ్ బోర్డ్ ఛైర్ రఘు చిట్టిమల్ల గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో ఐటీసర్వ్లో చేరడం ద్వారా కంపెనీలకు దక్కే లాభాలను ప్రెసిడెంట్ అంజు వల్లభనేని వివరించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ శివ మూపనార్, ఐటీ సర్వ్ గవర్నింగ్ బోర్డ్ డైరెక్టర్లు అమర్ వరద, వినయ్ మహాజన్, జగదీశ్ మొసాలి, సినర్జీ 2025 చైర్ సురేష్ కందల, అక్షయ పాత్ర ఫౌండేషన్ యూఎస్ఏ సీఈవో నవీన్ గోయెల్ తదితరులు ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకున్నారు.
అలాగే సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా స్థానిక పోలీసు డిపార్ట్మెంటుకు వెయ్యి డాలర్ల విరాళాన్ని ఐటీసర్వ్ అందజేసింది. ఈ సందర్భంగా వోట్ ఆఫ్ థ్యాంక్స్‌ను ప్రతిపాదించిన సుబ్రహ్మణయం ఒసురు.. ‘ఈ కార్యక్రమం కోసం నిరంతరం కృషి చేసిన మా కోర్ టీంను ప్రత్యేకంగా అభినందించాలి. వాళ్లందరూ కష్టపడి శ్రమించకపోతే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగేది కాదు’ అని చెప్పారు. తమకు మద్దతిచ్చిన గ్రాండ్ స్పాన్సర్లు, ప్లాటినం స్పాన్సర్లు, ఈవెంట్ స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.








