పాక్ నిఘా పై భారత్ మాకు సాయపడాలి
పాకిస్థాన్‌ను కట్టడి చేయడంలో భారతదేశ చేయూత కోసం చూస్తున్నామని ఐక్యరాజ్య సమితికి అమెరికా రాయబారి నిక్కీ హేలీ తెలిపారు. అమెరికా- భారతదేశ మిత్ర మండలి నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న పాకిస్థాన్‌పై డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరిని అవలంబిస్తున్నారని అన్నారు. అమెరికాకు పాకిస్థాన్ భాగస్వామిగా ఉందని, దానిని తాము గౌరవిస్తామని చెప్పారు. కానీ అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తుండటాన్ని తాము సహించబోమని అన్నారు. పాకిస్థాన్‌లోని ఏ ప్రభుత్వం ఇటువంటి ఆశ్రయమిచ్చినా సహించబోమని తెలిపారు. ఈ నూతన విధానాన్ని భారతదేశం, పాకిస్థాన్ అర్థం చేసుకోవాలన్నారు. ఆప్ఘనిస్థాన్ విషయంలో అమెరికాకు భారతదేశం మరింత సహాయపడాలని కోరుకుంటున్నామన్నారు. భారతదేశం, ఆప్ఘనిస్థాన్ మంచి పొరుగు దేశాలని, ఈ ప్రాంతంలో తమకు మంచి భాగస్వామ్య దేశమని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రమే కాకుండా పాకిస్థాన్‌పై అమెరికా నిఘా పెట్టేందుకు భారతదేశం సహాయపడాలని తెలిపారు.













