చైనాను కాదని భారత్ కు మద్దతు!
ఐక్యరాజ్య సమితిలో ఓ కీలక కమిటీలో భారత్ సభ్యత్వం సంపాదించింది. ఐరాసలోని ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ఈసీఓఎస్ఓసీ)కి చెందిన యూఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ వుమెన్ లో సభ్యత్వం కోసం జరిగిన ఎన్నికల్లో చైనాను ఓడించింది. ఈ పోటీలో అఫ్గానిస్థాన్ సైతం బరిలో నిలిచింది. లింగ సమానత్వం, మహిళల సాధికారత కోసం భారత్ చేస్తున్న కృషికి ఈ విజయం గుర్తింపు వంటిదని ఐరాసలోని భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఓటింగ్‌లో భారత్‌కు మద్దతుగా నిలిచిన సభ్యదేశాలన్నింటికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2025 వరకు భారత్ ఈ కమిటీలో సభ్యత్వం ఉండనుంది.
ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన భారత్ గెలుపొందగా, అఫ్గానిస్థాన్ బ్యాలెట్ ఓట్లు సాధించి గౌరవాన్ని నిలబెట్టుకుంది. చైనాకు మాత్రం బ్యాలెట్‌కు కావాల్సిన ఓట్లలో సగం కూడా రాకపోవడం గమనార్హం. చైనా తన దుందుడుకు స్వభావంతో అంతర్జాతీయ మద్దతు కోల్పోతుందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.













