తానా ఒమిక్రాన్ వెబినార్ విజయవంతం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో ప్రస్తుత కోవిడ్-19 ఒమిక్రాన్ దాని ప్రభావంపై ఓ వెబినార్‌ను నిర్వహించింది. ఒమిక్రాన్ యొక్క వైరాలజీ, మరియు ఎపిడెమియాలజికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు, సార్స్ కోవిడ్ 2 అభివృద్ధి చెందుతూనే ఉన్నందున దీనికి సంబంధించిన విషయాలు, పరిణామాలపై అవగాహనకోసం తానా ఈ వెబినార్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు తానా నాయకులను ప్రశంసించారు. జూమ్ మీటింగ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. దాదాపు 100 మందికిపైగా వీక్షకులు ఈ వెబినార్‌ను తిలకించారు. నార్త్ కాలిఫోర్నియా తానా ప్రాంతీయ సమన్వయకర్త రామ్ తోట ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, పలువురు తానా నాయకులు ఇందులో పాల్గొన్నారు.
తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ, తానా సేవా కార్యక్రమాలతోపాటు కమ్యూనిటికి అవసరమైన ఆరోగ్య కార్యక్రమాల విషయంలో కూడా ముందుంటుందని చెబుతూ అందులో భాగంగానే ప్రస్తుతం ఒమిక్రాన్‌తో ఇబ్బందులు పడుతున్న కమ్యూనిటీకి అవగాహన కల్పించేందుకు వీలుగా ఈ వెబినార్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
గెస్ట్ స్పీకర్‌గా హాజరైన డాక్టర్ మంజుల రఘుతు ఒమిక్రాన్‌పై అవగాహన కలిగేలా ప్రసంగించారు. ఒమిక్రాన్ స్వభావం, పరిణామాలు, సురక్షిత ప్రయాణం, మాస్క్, కోవిడ్ టెస్టింగ్ వంటి విషయాలతోపాటు క్వారంటైన్, టీకా, బూస్టర్ షాట్లు అలాగే భవిష్యత్తులో వచ్చే ఇతర కోవిడ్ వేరియంట్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కలిగేలా చేశారు.
తరువాత జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్లో కోవిడ్ 19, ఒమిక్రాన్ టెస్టింగ్, వ్యాక్సినేషన్, ప్రివెన్షన్, డిటెక్షన్, ట్రీట్మెంట్ వంటి వాటికి సంబంధించిన ప్రశ్నలకు తగిన సమాధానాలను ఆమె ఇచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అవగాహన కలిగించిన డాక్టర్ మంజులను అందరూ అభినందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రామ్ తోట హాజరైన తానా అధ్యక్షుడు అంజయ్యచౌదరిలావుకు, తానా కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తి తదితరులకు, డా. మంజులకు ఇతరులకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.













