ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మస్థ్యైం కోల్పోవద్దు : సుందర్ పిచాయ్
అమెరికాకు వెళ్లడానికి విమాన టిక్కెట్ కొనేందుకు నా తండ్రి ఏడాది జీతాన్ని ఖర్చు చేయాల్సి వచ్చింది అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మ స్థైర్యం కోల్పోవద్దని యువతకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం యూట్యూబ్ నిర్వహిస్తున్న డియర్ క్లాస్ ఆఫ్ 2020 కార్యక్రమంలో పిచాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే 27 ఏండ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వచ్చినప్పటికి జ్ఞాపకాలను పిచాయ్ గుర్తుకు తెచ్చుకున్నారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివేందుకు అమెరికా వెళ్తున్న తాను విమాన టికెట్ కొనేందుకు తన తండ్రి ఏడాది వేతనాన్ని వెచ్చించాల్సి వచ్చిందని తెలిపారు. తన తొలి విమానం ప్రయాణం కూడా అదేనన్నారు. అమెరికాలో జీవనం చాలా ఖరీదైనదని, ఇంటికి పోన్ చేయాలంటే నిమిషానికి 2 డాలర్లుకుపైగా చెల్లించాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. భుజాలకేసుకునే బ్యాగ్ విలువ భారత్‌లో నాన్న నెల జీతమని చెప్పుకొచ్చారు. తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడ్డానన్న ఆయన అదృష్టమే కాకుండా టెక్నాలజీపై తనకున్న అమితమైన ఇష్టం, దేన్నైనా పాజిటివ్‌గా ఆలోచించే స్వభావాలే భారత్ నుంచి అమెరికాకు రప్పించాయని చెప్పారు.
కాబట్టి ఈ కష్టకాలంలో ఆశాజనకంగా ఆలోచించాలని విద్యార్థులకు సూచించారు. ఈ క్రమంలోనే 1920, 70 2001లలో అంటురోగాలు, యుద్ధాలు, ఉగ్రవాద దాడుల మధ్య విద్యార్థులు ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసిన ఆయన దేన్నైనా మార్చగల శక్తి మీకుందన్నారు. చెన్నైకి చెందిన పిచాయ్.. ఐఐటీ ఇంజనీర్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ అభ్యసించారు. ఇక 48 ఏండ్ల పిచాయ్.. 2004లో గూగుల్లోకి అడుగుపెట్టి సంస్థ సారధి స్థాయికి ఎదిగారు.













