ఎఫ్డీఏ కీలక నిర్ణయం.. అమెరికాలో తొలిసారి ఆమోదం
అమెరికాలో గర్భనిరోధక మాత్రల విక్రయానికి సంబంధించి ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మందుల చీటీ (ప్రిస్క్రిప్షన్) అవసరం లేకుండానే ఓపిల్ అనే రకం గర్బనిరోధక మాత్రలను నేరుగా ప్రజలు కొనుగోలు చేసేందుకు అనుమతించనున్నట్లు ప్రకటించింది. ఓపిల్ను పెరిగో అనే ఔషధ కంపెనీ తయారు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఆ మాత్రలు మందుల షాపుల్లో అందుబాటులోకి రానున్నాయి. వయసుతో సంబంధం లేకుండా మహిళలు, బాలికలు ఎవరైనాసరే వాటిని కొనుగోలు చేయొచ్చని అధికారులు పేర్కొన్నారు. అమెరికాలో ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే ఓ గర్భనిరోధక ఔషధాన్ని విక్రయించేందుకు అనుమతి లభించడం ఇదే తొలిసారి. ఆ దేశంలో ఏటా సగటున 60 లక్షల గర్భధారణలు జరుగుతున్నాయని, అయితే వాటిలో 45 శాతం వరకూ అవాంఛితమైనవేనని అంచనా. గర్భనిరోధక ఔషధాల లభ్యతను పెంచాలంటూ మహిళలు, టీనేజీ బాలికల నుంచి కొన్నాళ్లుగా డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.













