కాలిఫోర్నియాలో చిక్కుకున్న హాకీ లెజెండ్ అశోక్ దివాన్
హాకీ ఒలింపియన్, 1975 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు సభ్యుడు అశోక్ దివాన్ అమెరికాలోని కాలిఫోర్నియాలో చిక్కుకుపోయారు. తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులుపడుతున్న తనను స్వదేశం తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రంగలోకి దిగిన క్రీడా శాఖ విషయాన్ని విదేశాంగ శాఖ దృష్టికి తీసుకుపోయింది. కాలిఫోర్నియా రాజధాని సాక్రమెంటోలో ఉన్న కుమారుడి వద్దకు వెళ్లిన దివాన్.. ఈ నెల 20న స్వదేశం రావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారితో ఆయన ప్రయాణం వాయిదాపడింది. మరోవైపు దివాన్‌ను హఠాత్తుగా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దాంతో తనను అమెరికా నుంచి రప్పించాలని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బాత్రాను అశోక్ అభ్యర్థించారు. ఈ విషయాన్ని బాత్రా క్రీడా మంత్రి కిరణ్ రెజిజు దృష్టికి తీసుకుపోయారు. విదేవీ వ్యవహారాల శాఖతో మాట్లాడి అశోక్‌ను స్వదేశం రప్పించేలా చూడాలని కోరారు.













