వాట్సాప్ కు సీఈవోగా భారతీయుడు!
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పలు బహుళ జాతి సంస్థలకు భారతీయులు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో మరో పేరు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ చాట్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ సీఈవోగా భారత్‌కు చెందిన నీరజ్ అరోరాను నియమించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ సంస్థ సీఈవో పదవి నుంచి జాన్ కౌమ్ వైదొలగడంతో వాట్సాప్ కొత్త సీఈవో వేటలో పడింది. అయితే వాట్సాప్ ఇప్పటికే అర్హులతో కూడిన ఓ జాబితాను రూపొందించినట్టు సమాచారం. అందులో వాట్సాప్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న నీరజ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న నీరజ్, గతంలో గూగుల్ కార్పొరేట్ డెవలప్మెంట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నీరజ్ ఓ క్లౌడ్ సొల్యూషన్ సంస్థలో చేరి, ఆ కంపెనీలో ఉన్నత స్థాయికి చేరాడు. 2006లో ఐబీఎస్ నుంచి ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం ఏడాదిన్నర పాటు టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ వర్క్ చేశాడు. ఆ తర్వాత గూగుల్‌లో చేరిన నీరజ్, 2011లో వాట్సాప్‌లోకి అడుగుపెట్టాడు.













