రష్యా వ్యాక్సిన్‌పై తొందరొద్దు : విజయ్ ఎల్దండి
రష్యా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌పై తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దని అమెరికాలో అంటువ్యాధుల వైద్య నిపుణుడిగా పని చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ ప్రొఫెసర్ విజయ్ ఎల్దండి అన్నారు. వ్యాక్సిన్ పనితీరు, సామర్థ్యం, ప్రతికూల ప్రభావాలపై లోతైనా పరిశోధన చేయాల్సి ఉన్నదని చెప్పారు. గతంలో డెంగ్యూ వ్యాక్సిన్ విషయంలో జరిగిన పరిణామాలను గుర్తుచేసుకోవాలని సూచించారు. 2016లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. డెంగ్యు రాని వాళ్లకు సెనోఫి వ్యాక్సిన్‌ను ఇవ్వడం వల్ల కొంత మందికి ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. పరిస్థితి తీవ్రమై చనిపోయారు అని విజయ్ తెలిపారు. రష్యా వ్యాక్సిన్ ప్రకటన నేపథ్యంలో విజయ్ ప్రత్యేకంగా మాట్లాడారు. రష్యా టీకా నిజంగానే విజయవంతమైనా పెద్ద మొత్తంలో ఉత్పత్తి జరిగి అందరికీ చేరువయ్యేందుకు రెండు, మూడేండ్లు పడుతుందని తెలిపారు. అప్పటివరకు దానికోసమే ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా శానిటైజర్ (చేతులను తరచూ శుభ్రపర్చుకోవటం), మాస్క్ ధరించటం, భౌతిక దూరం పాటించడం వల్ల సులవుగా వైరస్‌ను జయించవచ్చని సూచించారు.













