టెక్సాస్‌లో డొనాల్డ్ ట్రంప్‌కు నిరసనల సెగ
గత వారం ఒక సాయుధుడి కాల్పుల్లో అనేక మంది మరణించిన టెక్సాస్ రాష్ట్రంలో ఎల్పాసో నగరాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందర్శించారు. భారీ నిరసనలతో స్థానికులు ఆయనకు స్వాగతం పలికారు. నగరంలోని వాషింగ్టన్ పార్క్‌తో పాటు వివిధ ప్రాంతాలతో గుమికూడిన వేలాది మంది ఆయనకు తీవ్ర నిరసనను తెలియచేశారు. ట్రంప్ ఎల్పాసో పర్యటన అక్కడి బాధితుల పుండు మీద కారం జల్లినట్లుగా మారిందని పరిశీలకులు చెబుతున్నారు. ముందుగా ఆయన క్షమాపణ చెప్పి తరువాత ఇక్కడికి వచ్చి వుంటే బాగుండేదన్న ఎల్పాసో కౌంటీ కమిషనర్ డేవిడ్ స్టౌట్, అలా జరగటం సందేహాస్పదమేనని అన్నారు.
నిప్పులు చెరుగుతున్న ఎండను సైతం లెక్క చేయడకుండా మార్గానికి ఇరువైపులా నిలిచిన ఆందోళనకారులు ట్రంప్ ఓ జాత్యాహంకారి అని, జాతీయ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఎ)ను కాక తమ పిల్లలను కాపాడాలని నినదించారు. ఎల్పాసో ఎసిఒఎల్యు చెందిన ఆడ్రి పెరేజ్ ఆందోళనకారులనుద్దేశించి మాట్లాడుతూ ట్రంప్, నీ జాత్యహంకారం, నీ విద్వేషం, నీ అహంకారాన్ని సహించబోమని చెప్పటానికే మేం ఇక్కడికి వచ్చాం అని అన్నారు. తమ నిరసనను ఆగ్రహంలోకి, ఆగ్రహాన్ని కార్యాచరణలోకి మార్చాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు. కొంత మంది ఆందోళనకారులు ట్రంప్ గోబ్యాక్ అంటూ నినదించారు.













