ఉత్తరకొరియాకు అమెరికా షాక్
అగ్రరాజ్యం అమెరికా ఉత్తర కొరియాకు షాక్ ఇచ్చింది. తుఫాను వచ్చే ముందు వాతావరణం ప్రశాంతంగానే ఉంటుందనే సామేతలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాపై చాలా కాలంగా ఉన్న మౌనాన్ని సంచలన నిర్ణయంతో బద్ధలు కొట్టారు. ఉత్తర కొరియాపై భారీ ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నేను కీలక ప్రకటన చేస్తున్నా. ఉత్తర కొరియాపై ఎవరూ ఊహించని రీతిలో అమెరికా పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తోంది. నౌకాయానానికి సంంధించిన వాటితో పాటు మొత్తం 50 కంపెనీలపై ఆంక్షలు అమలు కానున్నాయి. ఖజానా శాఖ ఈ మేరకు చర్యలు ప్రారంభించింది అని నిపుణుల కమిటీ భేటీలో చెప్పుకొచ్చారు ట్రంప్. కాగా ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ కొరియా ప్రతినిధులతో భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడడం ఆసక్తికరంగా మారింది. అయితే ఉత్తర కొరియా తరుచూ క్షిపణి పరీక్షలతో ప్రపంచ దేశాల్ని ఉలిక్కిపాటుకు గురిచేస్తోన్న విషయం తెలిసిందే. ఇదే విషయంమై అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు క్షిపణి పరీక్షలు తగ్గించడం పట్ల అనేక సూచనలు చేశారు. అయినా కిమ్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఉత్తర కొరియా మిలటరీ, అణు పరీక్షలపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.













