కిమ్ తో చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ అయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకారం తెలిపారు. దక్షిణ కొరియా బృందం ద్వారా ట్రంప్‌నకు కిమ్ ఆహ్వానం పంపారు. ఈ మేరకు వచ్చే మే నెలలో ఇద్దరు నేతలు తొలిసారి సమావేశం కానున్నట్లు దక్షిణా కొరియా దౌత్యాధికారి వెల్లడించారు. అణ్వాయుధాల నిషేధంతో పాటు, న్యూక్లియర్, మిసైల్ టెస్టులను నిలిపివేసేందుకు కిమ్ కట్టబడి ఉన్నారని, కిమ్‌తో సమావేశం వివరాలను ట్రంప్‌నకు దక్షిణ కొరియా ఉన్నతాధికారుల బృందం వివరించిన అనంతరం వైట్‌హౌస్ వద్ద దక్షిణ కొరియా నేషనల్ సెక్యూరిటీ ఆఫీస్ హెడ్ చుంగ్ యుంగ్ మీడియాతో మాట్లాడారు. వీలైనంత త్వరగా ట్రంప్‌తో సమావేశం కావాలని కిమ్ ఎదురుచూస్తున్నారని అన్నారు. సమావేశానికి సంబంధించి వివరించిన తీరును ట్రంప్ మెచ్చుకోవడంతో పాటు అణ్వాయుధాల నిర్మూలన సాధించడానికి వచ్చే మే నెలలో కిమ్‌ను కలిసి చర్చలు జరుపుతానని ట్రంప్ చెప్పినట్లు ఆయన వివరించారు.













