డొనాల్డ్ ట్రంప్ కు గౌరవం కాని గౌరవం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఒక గౌరవం కాని గౌరవం లభించనుంది. సైంటిస్టులు ఇటీవలే కనుగొన్న ఓ కొత్తజీవికి ఆయన పేరును పెట్టేందుకు రంగం సిద్దమైంది. పాము తరహాలో ఉండే ఆ జీవికి కాళ్లు, కళ్లు లేవు. ఐదంగుళాల పరిమాణం ఉండే దాన్ని పనామా కెనాల్ అడుగున గుర్తించారు. ఈ ఉభయచర జీవి ఎక్కువ సమయం మట్టిలో తలపెట్టి కదలకుండా జీవితాన్ని గుడిపేస్తుంటుంది. కాగా, దీనికి పేరు పెట్టేందుకు నిర్వహించిన వేలంపాటలో ఎన్విరోబిల్డ్ అనే సంస్థ ఆ అవకాశాన్ని దక్కించుకుంది. సదరు జీవికి డెమోర్ఫిస్ డొనాల్డ్ ట్రంపీ అనే పేరు నిర్ణయించామని ఆ సంస్థ అధినేత ఐడాన్ బెల్ ప్రకటించారు. ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకొన్న సంగతి తెలిసిందే. ట్రంప్ కూడా ఈ జీవిలా వాస్తవాల్ని గ్రహించకుండా గుడ్డిగా ఆలోచిస్తారని, తనకు తోచిందే నిజమనుకుంటారని.. అందుకే ఆయన పేరు పెట్టాలని నిర్ణయించామని బెల్ తెలిపారు. అయితే అందుకు అధికారికంగా అనుమతి లభించాల్సి ఉంది. ట్రంప్ జుట్టును పోలీ ఉన్న పురుగుకు గత ఏడాది జనవరిలో నియోపాల్పా డొనాల్డ్ ట్రంపీ అన్న పేరును పెట్టిన సంగతి తెలిసిందే.













