కిమ్ హత్యకు అమెరికా కుట్ర!
వివాదాస్పద నేత కిమ్ జాంగ్ ఉన్ హత్యకు అమెరికా కుట్ర పన్నినట్లు ఉత్తర కొరియా పేర్కొన్నది. అమెరికా, దక్షిణ కొరియా దేశాలకు చెందిన ఏజెంట్లు కిమ్‌ను హత్యమార్చేందుకు ప్రణాళికలు వేసినట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించి నార్త్ కొరియా ఓ ప్రటన చేసింది. అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం సీఐఏ, దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్‌లు కలిసికట్టుగా ఓ ఉగ్రవాద గ్రూపుతో కిమ్‌ను చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు నార్త్ కొరియా భద్రతా మంత్రి వెల్లడించారు. అయితే ఆ ఉగ్ర గ్రూపును నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేయనున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రికత్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నార్త్ కొరియా తాజాగా ఈ ఆరోపణలు చేసింది. జీవరసాయనిక పదార్ధాలతో కిమ్‌ను హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు నార్త్ కొరియా ఏజెన్సీ కేసీఎన్ఏ పేర్కొన్నది. జీవరసాయన పదార్థాలు, రేడియోధార్మిక పదార్థాలు, నానో విషపూరిత పదార్థాలతో దాడికి కుట్ర జరిగినట్లు నార్త్ కొరియా వెల్లడించింది.













