ఆ దేశం వల్లే ప్రపంచ శాంతికి ముప్పు
అమెరికా, చైనా మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాజాగా తమ సైనిక లక్ష్యాలపై అమెరికా రూపొందించిన నివేదికను చైనా తప్పుబట్టింది. తమ వల్ల ప్రపంచానికి ఎలాంటి నష్టం లేదని, వాస్తవానికి అమెరికాయే అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఆ దేశం వల్లే ప్రపంచ శాంతికి ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించింది. చైనా సైనిక ఆశయాలతో తమ జాతీయ భద్రతకు, అంతర్జాతీయ నిబంధనలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందంటూ అమెరికా రక్షణశాఖ, ఆ దేశ కాంగ్రెస్కు ఓ నివేదికను సమర్పించింది. ఇది తమను రెచ్చగొట్టే చర్యేనని చైనా మండిపడింది.
అమెరికా అనిశ్చితిని సృష్టిస్తోంది. అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ప్రపంచ శాంతిని నాశనం చేస్తోంది. ఇరాక్, సిరియా లిబియాతో పాటు అనేక దేశాల్లో అమెరికా చర్యల వల్ల 8 లక్షల మందికిపైగా మరణించారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఆత్మపరిశీలన చేసుకోకుండా, చైనాపై తప్పుడు నివేదికలను అమెరికా రూపొందించి. అసత్య ఆరోపణలు చేయడం మాని, చైనా సైన్యాన్ని హేతుబద్ధంగా చూడాలని అమెరికాకు సూచిస్తున్నాం. ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం అని చైనా రక్షణ శాఖ ప్రతినిధి వూ కియాన్ పేర్కొన్నారు.













