ఆటా ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తోంది. వాషింగ్టన్ డీసీ, న్యూజెర్సీ, డెలావేర్, డెట్రాయిట్, నాష్విల్లే, ఆస్టిన్, డల్లాస్, రాలైగ్ తదితర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలను చేపట్టగా, రెండు వారాలపాటు మరో 10 నగరాల్లోనూ మహిళా దినోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆటా తెలిపింది. వివిధ ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపార నిర్వహణలో ఉన్నవారితో పాటు, కొత్తగా అమెరికాకు వచ్చిన మహిళల కోసం ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. మరింత మెరుగైన సమానత్వం ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో వేలాది మహిళలు భాగస్వాములవుతున్నారు. ఫ్యాషన్ షోలు, ఆలోచింపజేసే చర్చలు, ఆట పాటలు, నృత్యాలు, వివిధ పోటీలు, క్విజ్లు వంటిని నిర్వహిస్తున్నారు. డెలావేర్లో లెఫ్టినెంట్ గవర్నర్‌తో కలిసి ఆటా అధ్యక్షుడు పరమేశ్ భీమ్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. మహిళా హక్కుల పరిరక్షణకు కృషి చేయడంలో ఆటా ముందుంటుందన్నారు. డల్లాస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వారికి సంతాపం తెలిపారు.













