AAA: థమన్ మ్యూజిక్ షోతో ముగిసిన ఎఎఎ మహాసభలు
పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్లో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటిసారిగా భారీ ఎత్తున నిర్వహించిన మహాసభల వేడుకలు 2వ రోజు వివిధ కార్యక్రమాలతో, థమన్ (S Thaman) మ్యూజికల్ నైట్‌తో అట్టహాసంగా జరిగి ముగిసింది. ఎంతోమంది సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, వివిధ రంగాల ప్రముఖులనడుమ 2వ రోజు వేడుకలు కూడా చూడముచ్చటగా జరిగింది.
2వ రోజు ఉదయం శ్రీనివాస కళ్యాణంతో కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల నుంచి వచ్చిన అర్చకులు శ్రీనివాస కళ్యాణంను శాస్త్రోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఎఎఎ నాయకులు, వచ్చిన అతిధులు పలువురు పాల్గొని స్వామివారి ఆశీర్వాదములను అందుకున్నారు. ఉగాదిని పురస్కరించుకుని పంచాగ శ్రవణం కూడా చేశారు. మధ్యాహ్నం వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఎంతోమంది కళాకారులు ఇందులో పాల్గొని తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించారు. వయ్యారిభామల హంసనడకలతోసాగిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. దక్షయఙం పౌరాణిక కార్యక్రమం ఎంతో ఆకట్టుకుంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల ప్రసంగాలు అలరించాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎఎఎ ఛాప్టర్ల నాయకులను ఈ మహాసభల వేదికపైకి ఆహ్వానించి సత్కరించారు. మాట్లాడిన పలువురు వక్తలు ఎఎఎ అసోసియేషన్ ఇంత భారీఎత్తున సమావేశాలను విజయవంతంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చివరన తమన్ సంగీత విభావరి వచ్చినవారిని ఉర్రూతలూగించింది. పవన్ కళ్యాణ్ సినిమాల్లోని హిట్ పాటలు, బాలయ్య సినిమాల్లోని హిట్ పాటలతో తమన్ అందరినీ అలరించారు. చివరన నిర్వాహకులు ఈ వేడుకలను విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు.
అలరించిన బిజనెస్ కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఏర్పాటుచేసిన సెమినార్లో తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిశ్రమలకు కేంద్రంగా మార్చడంలో విశేషంగా కృషి చేస్తున్నారని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా అండగా ఉండటం వల్ల రాష్ట్రంలో అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అమరావతి రాజధాని పనుల ప్రారంభం, అంతర్జాతీయ విద్యాసంస్థలు, ఐటీ సంస్థల ఏర్పాటు వంటివి రాష్ట్రంలో పురోభివృద్ధికి సూచనలుగా ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ గూడూరు కూడా రాష్ట్రాభివృద్ధికి ఉన్న అవకాశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మోడరేటర్‌గా ప్రసాద్ కునిశెట్టి వ్యవహరించారు.







