అమెరికా వచ్చిన 21 మంది తెలుగు విద్యార్థులకు అనుమతి నిరాకరణ
అమెరికా యూనివర్సిటీ కాలేజీ లలో అడ్మిషన్ సంపాదించి అమెరికా వచ్చిన తెలుగు విద్యార్డులలో 21 మంది కి నిన్నటి రోజున అమెరికా లోని చికాగో, అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల ఎయిర్ పోర్ట్ లలో అనుమతి నిరాకరించి వెనకకు పంపేశారు అన్న విషయం తెలుగు విద్యార్థి లోకానికి తీవ్ర నిరాశ కలిగించింది.
అమెరికా యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, ఆ పైన వీసా వచ్చింది అన్న ఉత్సాహంతో ‘అమెరికా ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ లలో స్వాగతం చెపుతారు’ అనుకొంటూ వచ్చిన విద్యార్థులకు ఇది ఒక షాకింగ్ పరిణామమే. అమెరికా దేశపు ఇమ్మిగ్రేషన్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి.. వీసా వున్న వారిని కూడా ఎందుకు వచ్చారు? ఎన్నాళ్ళు ఉంటారు? ఎక్కడ ఉంటారు? లాంటి అనేక ప్రశ్నలు వేసి, సంతృప్తికరమైన సమాధానాలు వస్తేనే వారిని అమెరికా లోకి అడుగుపెడతానికి అనుమతి ఇస్తారు.
నిన్న విద్యార్థుల విషయంలో కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలు అర్థం కాకపోవడం, లేదా వాటి జవాబులు ఇవ్వడానికి సరి అయిన ప్రేపరేషన్ లేక పోవడం, తడబడుతూ సమాధానాలు చెప్పడం వలన ఇమ్మిగ్రేషన్ కౌంటర్ నుంచి పూర్తి స్థాయి విచారణ కు వేరే గదికి పంపించారు అని, అక్కడ వచ్చిన విద్యార్థుల ఫోన్ కూడా తీసుకొని పరిశీలించారని, ఆపైన వారికి అనుమతి నిరాకరించారని, వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించారని తెలిసింది. అమెరికా లో ఇమ్మిగ్రేషన్ అధికారుల నిర్ణయం పై ఎటువంటి రాజి ప్రయత్నం, లేదా బయట నుంచి సహాయం తీసుకోవడం జరగదు అని అందరూ తెలుసుకోవాలి.
ప్రతి సంవత్సరం భారత దేశం నుంచి దాదాపు గా ఒక లక్ష మంది విద్యార్థిని విద్యార్థులు పై చదువులకు అమెరికా వస్తున్నారు అన్న విషయం అందరికి తెలిసిందే! అందులో దాదాపు 40% తెలుగు రాష్ట్రాలనుంచే అని మనం గర్వంగా చెప్పుకుంటారు కూడా.. ఇది వరకు రోజుల్లో కొన్ని యూనివర్సిటీ కాలేజీలు మాత్రమే అడ్మిషన్ లు ఇచ్చేవి.. అలాగే ఆర్థిక స్తోమత వున్న కొంత మంది, బాగా చదువు కొని GRE, GMAT లాంటి పరీక్షలలో కూడా మంచి మార్కులు తెచ్చుకొని, స్కాలర్ షిప్ సంపాదించిన వారు మాత్రమే వచ్చేవారు. అయితే కాల క్రమేణా ఇతర దేశాల ( ముఖ్యం గా ఇండియా మరియు చైనా ) విద్యార్థులు చెల్లించే ట్యూషన్ ఫీజులు గమనించి అనేక కాలేజీ లు అడ్మిషన్ ప్రక్రియ సులభతరం చేశాయి. అంతే కాకుండా ఏదో విధంగా పై చదువులకు వెళ్ళాలి అనుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మధ్య తరగతి కుటుంబాలు కూడా తమ పిల్లలని పై చదువులకు పంపుతున్నారు.
జూలై – ఆగస్టు – సెప్టెంబర్ మాసాలలో స్టూడెంట్ వీసా మీద వచ్చే విద్యార్థులు ఇమ్మిగ్రేషన్ చట్టం గురించి పూర్తిగా తెలుసుకొని, కావలసిన డాకుమెంట్స్ చూపించటానికి వీలుగా పెట్టుకొని, సాధారణంగా అడగబోయే ప్రశ్నలు, వాటికి కావాల్సిన జవాబులు మీద క్షుణ్ణంగా తయారీ రావాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం.













